వారి వారసులొస్తున్నారహో..!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కొత్తవారికి మార్గం సుగమం అయ్యింది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న వారంతా కూడా వయోభారంతో బాధపడుతున్న వారే. వీరి స్థానాన్ని ఇప్పుడు వాళ్ల వారసులు భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు చిత్తూరు జిల్లా వరకు ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు చక్రం తిప్పిన నేతలంతా ఇక వారి వారసులకు రాజకీయా పాఠాలు నేర్పిస్తున్నారు ఇప్పుడు. ఏదైనా ఒక కుటుంబంలో రాజకీయ నేతలున్నారంటే... ఇక వారి వారసులు కూడా అదే బాటలో పయనిస్తారు. రాజకీయం ఒక బురద అంటూ సినిమా డైలాగులు ఉన్నప్పటికీ... ప్రజా సేవ పేరుతో పదవిలో ఉండేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతారు నేతలు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరుల వారసులు ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్‌లో పాల్గొంటున్నారు. ఇక స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్... ఇప్పటికే ఆమదాలవలస నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు. అధికార పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌ల వారసులు ఇప్పటికే వారి వారి తండ్రుల తరఫున జోరుగా తిరిగేస్తున్నారు. ఆదిమూలపు సురేష్ కుమారుడు విశాల్ ఈ ఏడాది ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఇచ్చిన విందులో జిల్లాకు చెందిన అందరు నేతల వారసులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు కూడా. బాలినేని శ్రీనివాస్ కుమారుడు ప్రణీత్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి అయితే పోటాపోటీగా నెల్లూరు ఆనందయ్య కరోనా మందును పంపిణీ చేశారు. కొంతమంది నేతల వారసులు అయితే చట్టసభలకు పోటీ చేసి ఓడారు కూడా. కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్, పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వీళ్లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు కూడా. ఇక కొంతమంది వారసులు అయితే ఇప్పటికే చట్టసభలకు ఎన్నికయ్యారు కూడా. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి తిరుపతి కార్పొరేషన్ డిప్యూటి మేయర్‌గా ఉన్నారు. ఇక బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: