బాబు కుప్పం యాత్రలో హైడ్రామా.. అందుకోసమేనా..?

Chakravarthi Kalyan
చంద్రబాబు కుప్పం యాత్ర తొలిరోజే ఉద్రిక్తతలకు దారి తీసింది. కుప్పం బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్నవేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి బహిరంగసభలో అలజడి సృష్టించాడు. బాంబు తెచ్చాడన్న అనుమానంతో టీడీపీ కార్యకర్తలు అతన్ని పట్టుకున్నారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకైనా మంచిదని చంద్రబాబు భద్రతా సిబ్బంది బుల్లెట్‌ ఫ్రూఫ్ జాకెట్లు తెరిచారు. చంద్రబాబుకు రక్షణగా నిలిచారు.

దీంతో టీడీపీ శ్రేణులు వైసీపీ గూండాయిజం నశించాలి, సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామంతో కలత చెందిన చంద్రబాబు..బాబాయిని చంపినోడు భయపడాలి కానీ, మనమెందుకు భయపడతామని ప్రశ్నించారు. గతంలో కోడి కత్తి కేసు ఏమైంది... తప్పుడు ప్రచారం వాళ్లు చేసుకున్నారు.. మనం కాదు అంటూ టీడీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే కమిషన్‌ వేస్తామని... తప్పు చేసిన వారిని శిక్షించే వరకు వదిలిపెట్టనని అన్నారు.

అయితే.. కుప్పం పర్యటనను మీడియాలో హైలెట్ చేయించుకోవడం కోసం.. బాంబులు, రాళ్ల దాడులు అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారంటున్నారు వైసీపీ నేతలు. కుప్పంలోనూ అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పొందారని గుర్తు చేసిన కన్నబాబు... తన పునాదులు కదిలిపోతున్నాయని తెలిసే చంద్రబాబు చవకబారు ఎత్తుగడలు వేస్తున్నాడన్నారు. నిన్నటి వరకు గంజాయి, హెరాయిన్ అని, ఆ తర్వాత దాడులని ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏపీలో శాంతిభద్రతలు లేవని చెప్పేందుకే చంద్రబాబు కుయుక్తులు, కుట్రలు పన్నుతున్నారని కన్నాబాబు మండిపడ్డారు.

చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారమే కుప్పం సభలో అలజడి సృష్టించేలా చేశారని.. తాను ఏం చెబితే అది రాసే పచ్చ పత్రికలు, చూపించే మీడియా ఉందని  కుప్పం మీటింగ్ లో డ్రామా ఆడారని కన్నబాబు మండిపడ్డారు. ఎవరైనా అభివృద్ధిపైనో, సంక్షేమంపైనో చర్చకు రమ్మంటారని, బూతులపై  చర్చకు రమ్మని సవాళ్లు విసురుతున్నాడంటేనే.. చంద్రబాబు ఎంతగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చని కన్నబాబు మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: