ఈటలను అందుకే కలిశానంటున్న రేవంత్ రెడ్డి..!

NAGARJUNA NAKKA
బీజేపీ నేత ఈటల రాజేందర్ ను తాను బహిరంగంగానే కలిశానని టీపీసీీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఓ పెళ్లి పత్రిక ఇవ్వడానికి నేతలందరం కలిశామని.. ఈటలను తాను చీకట్లో కలవలేదన్నారు రేవంత్. కేసీఆర్ కుట్రల గురించి ఈటల తనతో చెప్పారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కిషన్ రెడ్డితో ఈటల భేటీని ఏర్పాటు చేసింది కేసీఆర్, కేటీఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశానన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు. మంత్రి పదవికి రాజీనామా చేశాక రేవంత్ రెడ్డిని కలిశాననీ. దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాక అన్ని పార్టీల నేతలను కలుస్తున్నానని చెప్పారు.
ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత భట్టివిక్రమార్క కూడా స్పందించారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసిపోయాయని మంత్రి కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పటికీ కలవవనే విషయం దేశమంతటికీ తెలుసని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒక్కటేనని.. ఈ రెండు పార్టీలు కలిసి దళితబంధు పథకాన్ని ఆపేశాయని చెప్పారు. అటు గాంధీ భవన్ కు గాడ్సే రావడం కాదు.. తెలంగాణ భవన్ లోకి తెలంగాణ ద్రోహులు వచ్చారని శ్రీధర్ బాబు అన్నారు.
మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ విజయం ఖాయమని.. ఎంత మెజారిటీ వస్తుందనేదే విషయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇక్కడ గెలిచేందుకు టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఈసీ అనుమతి ప్రకారమే ప్రచారం చేస్తున్నామనీ.. కొందరు అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. ఇక గ్రామ పంచాయతీలకు కేంద్రమే డబ్బులిస్తుందని తెలిపారు. దళితబంధు పథకం క్రెడిట్ ఈటలకే దక్కుతుందన్నారు. చూద్దాం.. ఈటల, రేవంత్ రెడ్డి కలయిక ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: