శబరిమల ప్రవేశంపై సీఎం క్లారిటీ..!

Podili Ravindranath
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది శబరిమల అయ్యప్ప స్వామి దర్శనంపై ఆంక్షలు విధించిన కేరళ సర్కార్.... ఈ ఏడాది మాత్రం కాస్త వెసులు బాటు కల్పించింది. మండల దీక్ష, మకరవిళక్కు సందర్భంగా శబరి గిరి వాసుని దర్శించుకునేందుకు ప్రారంభంలో రోజుకు 25 వేల మంది భక్తులను అనుమతిస్తామన్నారు. నవంబర్ 16వ తేదీ నుంచి శబరిమల యాత్ర ప్రారంభం అవుతుందని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. శబరి యాత్ర నేపథ్యంలో అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి. పరిస్థితిని బట్టి భక్తుల సంఖ్యపై నిర్ణయం తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి. సవరించాల్సి వస్తే... అధికారులతో చర్చించి... అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు ముఖ్యమంత్రి పినరయి విజయన్. మకర విళక్కు కోసం దీక్షలు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
మకర విళక్కు సందర్భంగా ప్రతి ఏటా అయ్యప్ప దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున శబరిమల కొండకు వస్తుంటారు. స్వామి దర్శనం చేసుకునే భక్తులకు ఎలాంటి వయో పరిమితి లేదన్నారు. పదేళ్ల లోపు పిల్లలకు, 65 ఏళ్లు దాటిన వారిని కూడా స్వామి దర్శనానికి అనుమతిస్తారమన్నారు పినరయి విజయన్. అయితే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న సర్టిఫికేట్ లేదా 48 గంటల ముందు కొవిడ్ నెగిటివ్ అని ఆర్టీపీసీఆర్ రిపోర్టు తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేశారు. సర్టిఫికేట్ లేని వారిని పంపా నది వద్దే ఆపేస్తామన్నారు. ఇక శబరిమల చేరుకున్న ప్రతి ఒక్కరు నెయ్యాభిషేకం చేసే అవకాశం కల్పించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డును ప్రభుత్వం ఆదేశించింది. ఎరుమేలి మీదుగా అటవీ మార్గంలో కానీ... పులిమేడు మీదుగా సన్నిధానానికి సంప్రదాయ మార్గంలో కానీ... భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదన్నారు ముఖ్యమంత్రి విజయన్. భక్తుల వాహనాలను నిలక్కల్ వరకు మాత్రమే అనుమతించారు. అక్కడ నుంచి పంపా నది వరకు కేరళ స్టేట్ ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాల్సి ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాట్లు కేరళ సీఎం పినరయ్ విజయన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: