వైఎస్ పాటతో.. షర్మిల.. !

Chandrasekhar Reddy
తెలంగాణాలో రాజకీయ సంక్షోభం రావటంతోనే తాను కొత్తపార్టీ తో ప్రజల ముందుకు రావడం జరిగిందని వైఎస్ షర్మిల అన్నారు. ఇటీవలే ఆమె పార్టీ పెట్టారు. అయితే అదంతా ఎవరో వెనుక ఉండి చేయిస్తున్న పని అని విమర్శలు గుప్పుమన్నాయి. ఇదంతా అధికార పార్టీ ఓటు చీల్చే రాజకీయం అని విపక్షాలు అంటే, ఇదంతా బీజేపీ పని అని కొందరు అన్నారు, జగన్ తోక పార్టీ అని కూడా అన్నారు. ఇలా ఎవరో నీడ పార్టీగా తప్పితే తనకంటూ ఒక నిర్దిష్టమైన గుర్తింపు ఇప్పటివరకు లభించలేదు. దీనితో వివిధ వార్తా మాధ్యమాల ద్వారా ఇంటర్వ్యూ లు ఇస్తూ, తాను తెలంగాణాలో రాజకీయ శూన్యతను చూశానని, ఒక తెలుగు రాష్ట్రంలో ఎలాగూ వైఎస్ పాలన ప్రజారంజకంగా సాగుతుంది, అదే పాలన తెలంగాణాలో ఎందుకు తేకూడదు అనే ఆలోచన నుండి ఈ పార్టీ పుట్టింది తప్ప ఎవరి ప్రాబల్యం వాళ్ళ పుట్టలేదని ఆమె స్పష్టం చేశారు.
నాడు వైఎస్ అనేక ప్రజాప్రయోజనాలు కలిగించే పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అయితే అయన అనంతరం అలాంటి పాలన లేదా పథకాలు ఎక్కడా కనిపించకపోవడం శోచనీయం. తెలంగాణ ఆవిర్భావం నుండి అధికారంలో ఉన్న తెరాస కూడా పెద్దగా ప్రజాభిమానాన్ని సంపాదించే పథకాలు ఏవీ ప్రవేశపెట్టలేదు. ఏదో ఎన్నికల సందర్భంలో ఆయా పథకాలు పెట్టడం, చేతులు దులిపేసుకోవడం లాంటివే ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ గమనిస్తూనే ఉన్న తనకు తెలంగాణలో వైఎస్ పాలన తెచ్చి ప్రజల జీవితాలలో మళ్ళీ సుఖసంతోషాలను చూడాలని ఆశించే పార్టీ పెట్టినట్టు షర్మిల చెప్పారు. తన పార్టీ పేరు సహా పథకాలు, మేనిఫెస్టో అంత నాన్నగారిదే ఉంటుందని ఆమె అన్నారు.  
కేవలం ఆయన పాలనలో ప్రజలు అనుభవించినవి మళ్ళీ నా ద్వారా అందించాలన్నదే ఈ పార్టీ ప్రధాన లక్ష్యంగా ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సహా పలు పథకాలు మళ్ళీ యధావిధిగా ఈ తెలుగు రాష్ట్రంలో కూడా అమలు కావాలి, విద్యార్థులు, మహిళలు తమ హక్కుల ప్రకారం అన్నిటిని పొంది వారి జీవితాలను తీర్చిదిద్దుకోవాలని.. అటువంటి రోజులు మళ్ళీ వైఎస్ పాలన ద్వారానే వస్తాయని ఆమె అన్నారు. ఈ పార్టీ పేరుతో నా ముఖం మాత్రం ఉంటుంది తప్ప, అంతా నాన్న ఉన్నప్పుడు ఎలా ఉందొ అంతకంటే బాగానే చేయాలని ఉంది, దానికి ఒక అవకాశం కావాలి, అది ఇస్తారనే భావిస్తున్నట్టు షర్మిల అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: