సోలార్ పవర్‌తోనే ఇన్ని కష్టాలు...!

Podili Ravindranath
ఆసియాలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. 2018లో కర్ణాటకలోని తుముకూరు జిల్లాలోని పావుగడ తాలుకాలో దాదాపు 12 వేల 800 ఎకరాల్లో ఈ మెగా సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది కర్ణాటక సోలార్ పవర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్. రాష్ట్రంలో ప్రస్తుతం 15 శాతం విద్యుత్ అవసరాలను ఈ సోలార్ ప్లాంట్ తీరుస్తోంది. ఏకంగా 2 వందల కోట్లతో ఏర్పాటు చేసిన ఈ సోలార్ ప్లాంట్ వల్ల పర్యావరణానికి మేలు జరుగుతున్నప్పటికీ... స్థానికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి దుమ్ము, దూళి లేకపోయినా కూడా ప్లాంట్ మాకొద్దు బాబోయ్ అంటూ ఆందోళనలు చేస్తున్నారు పావుగడ వాసులు. అసలు ఈ ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేశారని కర్ణాటక ప్రభుత్వాని నిలదీస్తున్నారు కూడా.
నాలుగున్నర ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ మెగా సోలార్ ప్రాజెక్టు వల్ల ఇప్పుడు పావుగడ వాసుల కష్టాలు మరింత పెరిగాయి. ప్లాంట్ ఏర్పాటు చేసిన తర్వాత తాము అన్ని విధాలుగా నష్టపోయినట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పావుగడ పరిసరాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి. సాధారణ రోజుల్లో 30 డిగ్రీలు మాత్రమే ఉండే ఉష్ణోగ్రత.. ఇప్పుడు ఏకంగా 6 డిగ్రీలు పెరిగిపోయింది. సోలార్ ప్లేట్ల ఏర్పాటు వల్ల ప్రస్తుతం పావుగడ పరిసరాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయింది. దీని వల్ల పంటలు కూడా నష్టపోతున్నట్లు ఆరోపించారు గ్రామస్థులు. ఈ మెగా ప్రాజెక్టు వల్ల పావుగడ పరిసరాల్లోని వల్లూరు, తిరుమణి, బాలసముద్రం, కేతగంచర్లు, రాయల్‌చెర్వు గ్రామాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాంట్ ఏర్పాటు సమయంలో వేడి తగ్గించేందుకు అటవీ ప్రాంతాన్ని విస్తరిస్తామని కేఎస్‌పీడీసీఎల్ అధికారులు హామీ ఇచ్చారని... కానీ కనీసం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. తమకు పంట నష్టం పరిహారం చెల్లించాలని ఐదు గ్రామాల రైతులు ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: