`ద‌ళిత బంధు` : క‌త్తికి రెండు వైపులా ప‌దునుంట‌ది దొర‌..!

Paloji Vinay
  హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల వేళ  తెలంగాణ ముఖ్య‌మంత్రి అనూహ్యంగా ద‌ళిత బంధు ప‌థకాన్ని ప్ర‌క‌టించారు. దీని ద్వారా అర్హులయిన ద‌ళిత కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఇస్తామ‌ని చెప్పారు. దీంతో రాష్ట్ర‌రాజ‌కీయాల్లో ఈ ప‌థకం పై చ‌ర్చ మొద‌ల‌యింది. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ ల‌బ్ది కోసం మాత్ర‌మే ద‌ళిత బంధు ను ప్ర‌క‌టించార‌ని ప్ర‌తి ప‌క్షాలు ఆరోపించాయి. అలాగే ప్ర‌జ‌ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి.  రాజ‌కీయ ల‌బ్ధి కోసమే ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్రక‌టించిన‌ట్టు స్వ‌యంగా సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.
   
   పైలెట్ ప్రాజెక్టుగా ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని హుజురాబాద్ నియోజ‌కవ‌ర్గంలో అమ‌లు చేస్తున్నారు. అయితే, ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అయింది. తాము ఓటేస్తే గెల‌వ‌లేదా అంటూ విమ‌ర్శ‌లు చేశారు ప్ర‌జ‌లు. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో కూడా ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని అమలు చేసి అర్హుల‌యిన ద‌ళిత కుటుంబాల‌కు రూ. 10 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అలాగే ద‌ళిత‌ల‌తో పాటు మాకు ఓ బంధు కావాల‌ని మిగ‌త సామాజిక వ‌ర్గాల వారు కూడా త‌మ డిమాండ్‌ను లేవ‌నెత్తారు. బీసీ బంధు, గౌడ బంధు, విశ్వ‌క‌ర్మ బంధు, మైనారిటీ బంధు ఇలా త‌మ‌కు కూడా ఓ ప‌థ‌కాన్ని ప్రక‌టించి. అర్హుల‌కు రూ. 10 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని ఆయా సామాజిక వ‌ర్గాలు, ప్ర‌తి ప‌క్ష పార్టీల నేత‌లు త‌మ డిమాండ్‌ను తెర మీద‌కు తీసుకువ‌చ్చారు.
   
   ఇదే క్ర‌మంలో సీఎం కేసీఆర్ మొన్న‌టికి మొన్న రాష్ట్రానికి నాలుగు దిక్కుల ఉన్న మండ‌లాల్లో ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిపై ఇటీవ‌ల‌నే స‌న్నాహ‌క స‌మావేశం కూడా నిర్వహించారు. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల వేళ తీసుకువ‌చ్చిన ఈ ప‌థ‌కం ద్వారా టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి లాభం తో పాటు న‌ష్టం కూడా ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. గ‌తంలో ప్ర‌క‌టించిన ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల పంపిణీ ప‌థ‌కం ఎక్క‌డి వ‌ర‌కు వ‌చ్చిందో ఎవ‌రికీ తెలియ‌దు.. అలాగే తెలంగాణ ఏర్ప‌డిన వెంట‌నే మొద‌టి సీఎంగా ద‌ళితుడినే కూర్చోబెడుతాన‌ని సీఎం కేసీఆర్ ప్ర‌గాల్భాలు ప‌లికారు.


కానీ ఇప్ప‌టికీ రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ ద‌ళిత సీఎం మాట ఎత్త‌డం లేదు. దీంతో ప్ర‌జ‌ల్లో టీఆర్ఎస్‌పై కాస్త వ్య‌తిరేక‌త మొద‌ల‌వుతున్న స‌మ‌యంలో ద‌ళిత బంధును ప్ర‌క‌టించి ద‌ళితుల‌ను మ‌చ్చిక చేసుకోవాల‌నుకున్నారు సీఎం కేసీఆర్ అనే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.   గ‌తంలో ఇచ్చిన ద‌ళితుల‌కు మూడెక‌రాల పంపిణీ, ద‌ళిత సీఎం హామీల‌ను ప‌క్క‌న బెట్టిన‌ట్టే భ‌విష్య‌త్తులో  ద‌ళిత‌బంధు ప‌థకాన్ని ప‌క్క‌న పెడుతార‌నే అనుమానం వ్య‌క్తం అవుతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. అలా అయితే, కారు పంచ‌ర్ కావ‌డానికి ద‌ళిత బంధు ప‌థ‌కం ప్ర‌ధాన మేకుగా మారుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ద‌ళిత బంధును నిరాటంకంగా కొన‌సాగిస్తారా లేదా ఆ రెండు ప‌థ‌కాల లాగే ప‌క్క‌న పెడుతారా అనేది వేచి చూడాలి.

   

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: