ఓట్ల పథకాల వల్ల ప్రయోజనం ఎంత..?

MOHAN BABU
రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం పేరిట ప్రకటిస్తున్న ఓట్ల పథకాలు ఎంత వరకు ప్రయోజనం చేకూరుస్తూన్నాయి..? అసలు ఈ  పథకాల పేరుతో డబ్బులు పంచడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచనాపరుల మెదడును తొలుస్తున్న ఈ ప్రశ్నలకు అసలు జవాబు ఉందా..? ఎన్నికలకు ముందు ఓట్ల కోసం, అధికారం కోసం రాజకీయ పార్టీలు విసిరే వలలు రాష్ట్ర ప్రగతికి శరాఘాతంగా మారుతున్నాయి. రాష్ట్ర ఖజానా  హరించుకుపోయే ఇటువంటి పథకాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందానేది నూటికి నూరుపాళ్ళు నిజం. అసలు ఈ పథకాలు అర్హులకు అందుతున్నాయా..? అనే ప్రశ్నను పక్కనపెడితే ఇటువంటి పథకాల వల్ల అనర్హులు సైతం లబ్ధి పొందుతున్న సంఘటనలు ఎన్నో ఉంటున్నాయి.

ఖజానా మొత్తం ఖాళీ చేయడమేకాక రాష్ట్రాలు  అప్పుల కుప్పగా మారడానికి ఇటువంటి పథకాలే కారణమవుతున్నాయి. ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు తప్ప సంపన్నులు, వ్యాపారవేత్తలు సైతం ఇటువంటి పథకాల్లో లబ్ధిదారులు గా ఉంటున్నారు. ఉదాహరణకు ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఎంతో మంది సంపన్నులు, పెద్దపెద్ద వ్యాపార వేత్తలు  కూడా ఫ్రీ ఆపరేషన్ సౌకర్యం పొందారు. వీరు ప్రభుత్వ ఉద్యోగుల్లా నికర ఆదాయం చూపించరు. వందలు, వేల ఎకరాల మాగాణి భూములు ఉన్నవారు సైతం రైతుబంధు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను పొందుతున్నారు. ఇటువంటి బడా వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండలా, పథకాలు మేసే పందికొక్కుల్లా తయారయ్యారు. ఇలాంటి వారిని గుర్తించగలిగినా,చట్టంలోని లొసుగులు వల్ల ఈ పథకాలను వారికి దూరం చేయలేకపోతున్నారు. వీరు చేసే వ్యాపార లావాదేవీల్లో కస్టమర్లకు బిల్లులు ఇవ్వరు . తమ సంపాదనను ఆదాయపన్ను లెక్కల్లో చూపరు. అదే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఒక్క డాలరు కొనుగోలుపై కూడా బిల్లింగ్ సిస్టం ఉంటుంది. అందుకే అక్కడ పన్ను ఎగవేత ఉండదు. కానీ మన వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల ఎంతోమంది ఉచిత పథకాలను అప్పనంగా స్వాహా చేసి పన్ను ఎగ్గొట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. వృద్ధాప్య పింఛన్ల వంటివి ఎలాంటి ఆసరా లేని వారికి ఇస్తే ఉపయోగం ఉంటుంది. కానీ సంపన్నులు సైతం ఇలాంటి పథకాలను అనుభవిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకు అందాల్సిన రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను కూడా బడా భూస్వాములు సొంతం చేసుకుంటున్నారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా స్థిరపడిన వాళ్లు కూడా ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నారు. అదే అటెండర్ లాంటి చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసే దిగువ,మధ్యతరగతి జనాలు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారు తమ పిల్లలను వేలకొద్ది ఫీజులు చెల్లించి ప్రైవేటు బడుల్లో చేర్పించాలని దుస్థితి కనిపిస్తోంది.

అందువల్ల ఇలాంటి  ఫ్రీ స్కీమ్స్ బదులు పేదవారికి పనికి వచ్చే విధంగా పథకాన్ని ప్రవేశపెడితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారిలో చాలామందికి సొంత గూడు కూడా ఉండదు. అలాంటిది ఎన్నో ఇల్లు ఉండి, వేల రూపాయల రాబడి ఉన్నవారు సైతం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు అనేక ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు అంటే అసలైన అర్హులకు ఏం మిగులుతుంది. లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్లను కోట్ల సంపద ఉన్న వారు ఫ్రీగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పొందుతున్నారంటే ఇవి ఎంతగా దుర్వినియోగం అవుతున్నాయో అర్థమవుతుంది. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, సర్వేలు జరిపిన అవన్నీ తూతూమంత్రంగా అయిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: