సుప్రీంకోర్టు కొలీజియం మరో చారిత్రక నిర్ణయం..?

Chakravarthi Kalyan
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. వివిధ హైకోర్టులకు ఒకేసారి 68 మంది జడ్జిలను సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా భారత న్యాయ వ్యవస్థలో చరిత్రాత్మక ఘట్టంగా చెప్పొచ్చు. ఈ కొలీజియం ఒకేసారి 12 హైకోర్టులకు 68 మంది జడ్జిల పేర్లను సిఫారసు చేసింది. అలహాబాద్, రాజస్థాన్‌, కలకత్తా, ఝార్ఖండ్‌, జమ్ముకశ్మీర్‌, మద్రాస్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, హర్యానా, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, అస్సాంకోర్టులకు ఈ 68 మంది జడ్జిలను సిఫారసు చేసింది.

ఈ మొత్తం 68 మందిలో జ్యుడీషియల్ సర్వీసెస్‌ నుంచి 24 మందిని సిఫారసు చేసిన కొలీజియం.. బార్‌ అసోసియేషన్ల నుంచి 44 మందిని సిఫారసు చేసింది. ఈ 68 మందిలో పది మంది వరకూ మహిళలు ఉండటం విశేషం.. గౌహతి హైకోర్టు జడ్జిగా తొలి ఎస్టీ మహిళా జ్యుడీషియల్‌ ఆఫీసర్‌ సిఫారసు చేయబడ్డారు. గౌహతి హైకోర్టు జడ్జిగా మార్లీ వన్‌ కుంగ్‌ను కొలీజియం సిఫారసు చేసింది. ఈమె మిజోరం నుంచి సిఫారసు కాబడిన హైకోర్టు తొలి మహిళా జడ్జిగా నిలిచారు.

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ సిఫారసులు చేసింది. ఈ కొలీజియంలో సభ్యులుగా జస్టిస్‌ యు.యు. లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ ఉన్నారు. మన తెలుగు న్యాయ దిగ్గజం జస్టిస్ ఎన్‌.వి. రమణ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్ అయ్యాక.. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఖాళీలు త్వరగా భర్తీ అవుతున్నాయి. ఖాలీల నియమాకంపై జస్టిస్ ఎన్‌.వి. రమణ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ హైకోర్టుకు ఆయన ఏడుగురు జడ్జిలను నియమించిన సంగతి తెలిసిందే.

అలాగే కొన్నిరోజుల క్రితం సుప్రీంకోర్టుకు కూడా 9 మంది న్యాయమూర్తులను సిఫారసు చేశారు. ఇటీవలే వారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల భర్తీ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేవలం ఒక్క ఖాళీ మాత్రమే ఉంది. మొత్తానికి జస్టిస్ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో నిర్ణయాలు చకచకా జరిగిపోతుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: