అనవసరంగా ఇరుక్కుంటున్న రేవంత్-సీతక్క...

M N Amaleswara rao
తెలంగాణ పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ఈ ఇద్దరికీ టి‌డి‌పి అధినేత చంద్రబాబుతో ఎలాంటి సత్సబంధాలు ఉన్నాయో కూడా చెప్పక్కర్లేదు. పార్టీ మారినా సరే చంద్రబాబు అంటే రేవంత్, సీతక్కలకు ఎనలేని గౌరవమే. ఇప్పుడు అదే అంశం రేవంత్, సీతక్కలని ఇరుకున పెట్టేలా కనిపిస్తోంది.
చంద్రబాబు ప్రోత్సాహంతో టి‌డి‌పిలో లీడర్లుగా ఎదిగిన ఈ ఇద్దరు, కాంగ్రెస్‌లోకి వచ్చి, తెలంగాణలో దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా తక్కువ సమయంలోనే ఎదిగారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి పి‌సి‌సి పదవి కూడా వచ్చింది. ఇక ఇక్కడ నుంచే అసలు రాజకీయం మొదలైంది. రేవంత్‌కు పి‌సి‌సి చంద్రబాబు ఇప్పించారని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. రేవంత్, చంద్రబాబు మనిషి అని మాట్లాడుతున్నారు. ప్రత్యర్ధులే కాదు...పి‌సి‌సి పదవి రాలేదని అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఇదే తరహాలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.
టి‌పి‌సి‌సి కాస్త టి‌టి‌డి‌పి మాదిరిగా మారిపోయిందని మొదట్లోనే కామెంట్ చేశారు. అక్కడ నుంచి ప్రత్యర్ధులు సైతం చంద్రబాబు పేరుని ఉపయోగిస్తూ రేవంత్‌పై విమర్శలు చేస్తున్నారు. అటు ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా సీతక్క, చంద్రబాబుకు రాఖీ కట్టి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ విషయంపై కూడా విమర్శలు వస్తున్నాయి. దాంతో రేవంత్, సీతక్కలు ఆ విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయం వేరు, వ్యక్తిగత బంధాలు వేరని చెబుతున్నారు.
అయితే తాజాగా విజయమ్మ పెట్టిన వైఎస్సార్ సంస్మరణ సభకు కోమటిరెడ్డి వెళ్లారు. కానీ తెలంగాణ పి‌సి‌సి మాత్రం ఆ సభకు కాంగ్రెస్ నాయకులు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే కోమటిరెడ్డి సభకు వెళ్లారు. పైగా తమ పార్టీలో కొందరు వేరే పార్టీ అధ్యక్షుల కాళ్ళు మొక్కుతున్నారని, రాఖీలు కడుతున్నారని, అలాంటిది కాంగ్రెస్ మాజీ సి‌ఎం, తన అభిమాన నాయకుడు వైఎస్సార్ సభకు వెళ్ళడంలో తప్పేంటి అని మాట్లాడుతున్నారు. ఏదేమైనా చంద్రబాబు పేరు, రేవంత్-సీతక్కలని ఇరుకున పెడుతున్నట్లే కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: