ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్ చిత్రం ఇదేనా ?

VAMSI
ఏపీలో యువ నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో పాలన కొనసాగుతోంది. రాజకీయ అనుభవం కొంతమేరకు ఉన్నప్పటికీ పాలనతో కూడిన అనుభవం లేకపోవడంతో, పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కన్ఫ్యూజన్ కు గురవుతున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. ఒక్క ఛాన్స్ అనే ఒక్క నినాదంతో ఏపీ ప్రజల మనసులను కొళ్లగొట్టినా, ఆ ఆనందం ఆవిరై పోవడానికి ఎంతో కాలం పట్టలేదంటున్నాయి ప్రతి పక్ష నాయక వర్గాలు. కానీ ఇక్కడ జగన్ వైపు నుండి ఆలోచిస్తే తన వరకు ఏ హామీలను అయితే మానిఫెస్టోలో చేర్చాడో వాటన్నిటినీ దాదాపుగా నెరవేర్చే పనిలో ఉన్నాడు. కానీ వీటన్నిటినీ నెరవేర్చాలంటే దానికి ఆదాయ వనరులు ఏమిటి? ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరులతో పాలనతో పాటు సంక్షేమాన్ని కొనసాగించగలడా ? అన్న పలు కీలకమైన ప్రశ్నలు తన మదిలో మెదిలినట్లు అనిపించలేదేమో అని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.
తాజాగా చూస్తే గత రెండు నెలల నుండి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు కొద్ది రోజులు ఆలస్యంగా వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా కథనాల ప్రకారం అయితే సగం జీతాలే ఇస్తున్నారని, మరి కొందరేమో అసలు జీతాలే ఇవ్వట్లేదని చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా పలు రకాల చర్చలు జరిగేలా అవకాశమిచ్చింది ఏపీ ప్రభుత్వమేనని ప్రతి పక్షాలు సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్రము ఇప్పటికే వరల్డ్ బ్యాంకు మరియు రిజర్వు బ్యాంకు ల దగ్గర నుండి వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకుని సంక్షేమానికని ఖర్చు పెడుతుంటే భవిష్యత్తులో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వగలరో లేదో అర్ధం కావట్లేదని సీనియర్ పొలిటికల్ లీడర్స్ అనుకుంటున్నారు.
దీనిని బట్టి జగన్ త్వరిత ఆదాయ వనరులను తయారుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రానికున్న ఏకైక ఆదాయ వనరు మద్యం మాత్రమే. దీనిని ఆసరాగా చూపించే ఇప్పటి వరకు అప్పులు తీసుకున్నారని సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు ఇవ్వడం చాలా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి భవిష్యత్తు ఏ విధంగా మారనుందో ఆలోచిస్తేనే చాలా భయంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ త్వరలోనే తనపై వస్తున్న పాలనాపరమైన అన్ని విమర్శలకు సమాధానం ఇస్తాడా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: