హుజూరాబాద్ పోరు: కేసీఆర్‌కు రివర్స్ అవుతుందా?

M N Amaleswara rao
తెలంగాణ రాజకీయాల్లో ఉపఎన్నికలు ఎక్కువగానే వస్తుంటాయి. అయితే పార్టీలు ఉపఎన్నికలని అంత సీరియస్‌గా తీసుకున్న సందర్భాలు తక్కువ. అప్పుడు అనుకూలంగా ఉన్న పార్టీలకు ఉపఎన్నికలు కలిసొచ్చాయి. ఆ ఎన్నికల్లో పోటాపోటిగా అంటూ రాజకీయాలు నడిచేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్తితి మారింది. ఒకప్పుడు ఉపఎన్నికలు అంటే అలవోకగా విజయాలు సాధించే టీఆర్ఎస్‌కు ఇప్పుడు ఉపఎన్నిక అంటే భయం మొదలైనట్లు కనిపిస్తోంది.
అధికారంలో ఉన్నా సరే టీఆర్ఎస్‌కు ఉపఎన్నిక అంటే కాస్త ఇబ్బందిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే మొన్న ఆ మధ్య జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకమైన ఫలితం వచ్చింది. దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణించడంతో, ఆ స్థానానికి ఉపఎన్నిక వచ్చింది. అయితే సిట్టింగ్ సీటుని నిలుపుకోవడంలో టీఆర్ఎస్ విఫలమైంది. ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేసింది.
ఇక నాగార్జున సాగర్ ఉపఎన్నికలో సత్తా చాటిన టీఆర్ఎస్, ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో భయపడుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటివరకు కేసీఆర్ కుడిభుజంగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరి, హుజూరాబాద్ బరిలో మళ్ళీ నిలబడ్డారు. ఇలా ఈటల మళ్ళీ బరిలో నిలబడటంతో, టీఆర్ఎస్ ఆయన్ని ఓడించడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఈటలని దెబ్బకొట్టడానికి హుజూరాబాద్ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. వేల కోట్లతో సంక్షేమ పథకాలు అందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.
అలాగే బలమైన నాయకులని టీఆర్ఎస్‌లో చేర్చుకుంటూ ముందుకెళుతున్నారు. ఇప్పటికే ఎల్ రమణ, కౌశిక్ రెడ్డి, పెద్దిరెడ్డి, స్వర్గం రవి లాంటి నాయకులు గులాబీ గూటికి చేరుకున్నారు. అయితే ఇన్ని రకాలుగా ఈటలని దెబ్బకొట్టాలని చూస్తున్నే కేసీఆర్ వ్యూహాలు రివర్స్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం రాజకీయం కోసమే పథకాలు, ఇతర కార్యక్రమాలు చేస్తున్నారని ప్రజలకు అర్ధమైపోతుందని, ఇప్పుడు ఇదే అంశం టీఆర్ఎస్‌కు మైనస్ అయిన ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: