గుడ్‌న్యూస్‌: రామప్ప గౌరవం.. ఏపీ ఆలయానికి కూడా..?

Chakravarthi Kalyan
తెలంగాణలోని రామప్ప ఆలయం పేరు రెండు, మూడు రోజులుగా మీడియాలో మారు మోగిపోతోంది. 800 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఆ ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడమే ఇందుకు కారణం. ఇలాంటి గుర్తింపు ఉన్న తొలి తెలుగు కట్టడం కూడా ఇదే. అంతే కాదు.. గతేడాది దేశం మొత్తం నుంచి యునెస్కో నామినేషన్ పొందిన ఏకైక కట్టడం కూడా రామప్ప దేవాలయమే. అయితే ఇప్పుడు ఇదే తరహా యూనెస్కో గౌరవం.. ఓ ఆంధ్ర ప్రదేశ్ ఆలయానికి కూడా దక్కే అవకాశం కనిపిస్తోంది.

ఇంతకీ ఏపీలో అలాంటి గౌరవం దక్కనున్న ఆలయం ఏదంటారా.. అదే  ప్రఖ్యాత లేపాక్షి ఆలయం. ఈ లేపాక్షి బసవన్న గుడికి కూడా ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో నుంచి గుర్తింపు లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులే చెప్పారట. ఈ విషయాన్ని టీజీ వెంకటేష్‌ నేతృత్వంలోని పర్యాటకం, సాంస్కృతిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం పార్లమెంటుకు ఇచ్చిన రిపోర్టులో తెలిపింది.  

ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించాలంటే.. ముందు ఆ సంస్థ ప్రతినిధులు ఆ కట్టడాలను చూడాలి. అయితే పార్లమెంటరీ  కమిటీ 2020 జనవరిలో విశాఖపట్నం సందర్శించినప్పుడు ఆర్కియలాజికల్‌  సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు కూడా వచ్చారట. అదేంటి.. మీ ఏపీ నుంచి ఒక్క కట్టడానికి కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో స్థానం లేదేంటి అని ప్రశ్నించారట. అప్పుడు ఏపీలో గొప్ప చారిత్రక కట్టడాల గురించి ఆరా తీశారట.

ఆ సమయంలో ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు లేపాక్షి క్షేత్రం గురించి ఆ కమిటీకి చెప్పారట. అప్పటికే యునెస్కో తాత్కాలిక జాబితాలో ఆ ఆలయం ఉందని వివరించారట.   ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి ఇది మొదటి అంకం అని చెప్పారట. బహుశా త్వరలోనే లేపాక్షి ఆలయానికి కూడా యునెస్కో గుర్తింపు వస్తుందని ఆశించవచ్చన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: