పార్లమెంటులో కుమ్మేస్తారట.. వైసీపీకి అంత సీన్‌ ఉందా..?

Chakravarthi Kalyan
పార్లమెంటు సమావేశాలు ఈనెల 19 న ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై వైసీపీ నేతలు జగన్‌తో భేటీ అయ్యారు. అలా చేయాలి.. ఇలా చేయాలి అని ఎన్నో అనుకున్నారు. అయితే.. ప్రస్తుతం వైసీపీ కేంద్రంలో బీజేపీ సర్కారుకు అనుకూలంగానే ఉంటోంది. అందులోనే.. జగన్‌పై సీబీఐ కేసులు, బెయిల్ రద్దు ప్రమాదం పొంచి ఉన్న సమయంలో ఇప్పుడు జగన్ సర్కారు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశమే కనిపించడం లేదు.

కానీ.. ఈ సమావేశంలో మాత్రం అలా చేయాలి.. ఇలా చేయాలి.. అని నిర్ణయించినట్టు చెబుతున్నారు. కృష్ణా జలాల వివాదంపై కేంద్రం నుంచి స్పందన లేదు. దీనిపై నిలదీస్తారట. పోలవరం నిధులను తిరిగి చెల్లించడంలో జాప్యం జరగుతోంది. పునరావాసానికి కావల్సిన రూ.30వేల కోట్లలో ఇప్పటివరకూ పైసా కూడా ఇవ్వలేదు. అవి ఇవ్వాలని అడుగుతారట. తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు రూ.6,112 కోట్లు సాధిస్తారట. అంతే కాదండోయ్.

ఇంకా ఆశ్చర్యం కలిగించేదేమిటంటే.. ప్రత్యేకహోదాతోపాటు విభజన హామీలు తదితర అంశాలపై కూడా కేంద్రాన్ని ప్రశ్నిస్తారట. ఈ అంశాలపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తుతారట. కేంద్రంపై ఒత్తిడి తెస్తారట. తెలంగాణ చర్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేనందువల్ల సుప్రీంకు వెళ్లామన్న  విషయాన్ని కూడా పార్లమెంటులో ప్రస్తావిస్తారట. శ్రీశైలం, సాగర్‌, పులిచింతలను కేంద్రమే నిర్వహించాలని ఒత్తిడి తెస్తారట.

శ్రీశైలం నుంచి 800 అడుగుల్లోపే నీటిని తీసుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతినివ్వాలని అడుగుతారట. వంశధార ప్రాజెక్టు విషయంలో ట్రైబ్యునల్‌ తీర్పు ఏపీకి అనుకూలంగా వచ్చింది కాబట్టి దాన్నే కేంద్రం నోటిఫై చేయాలని ప్రశ్నిస్తారట. స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించకుండా, ఆ సంస్థను కాపాడేందుకు క్యాప్టివ్‌ మైన్‌ను కేటాయించాలని.. లేకపోతే.. సెయిల్‌,ఎన్‌ఎండీసీలో ప్లాంటును విలీనం చేయాలని డిమాండ్ చేస్తారట. మరి ఇలా నిలదీస్తామని చెప్పడం వరకూ బాగానే ఉంది. కానీ.. అసలు సీన్‌లోకి వెళ్లాక ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: