అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన చైనా.. తరిమి తరిమి కొట్టింది..?

Chakravarthi Kalyan
అమెరికా.. చైనా.. ఇప్పుడు ప్రపంచంలో అగ్ర రాజ్యాలు ఇవే. అందులో ఒక క్యాపిటలిస్టు దేశం. మరొకటి కమ్యూనిస్టు దేశం. అయితే క్రమంగా ప్రపంచంలో చైనా ఆధిపత్యం పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచ పెద్దన్నగా అమెరికాదే కీలక పాత్ర అయినప్పటికీ.. చైనా అమెరికాను సవాల్ చేసే స్థాయికి చేరుకుంటోంది. అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ అమెరికాకే సవాల్ విసురుతోంది. ఇలాంటి నేపథ్యంలో అమెరికాకు చెందిన  ఓ ఓడను చైనా సైన్యం తరిమి తరిమి కొట్టడం సంచలనంగా మారింది.

అసలు కథ ఏంటంటే.. చైనా దక్షిణ సముద్రంలో పరాసెల్స్‌ పేరుతో ఓ వంద ద్వీపాల సముదాయం ఉంది. ఈ దీవులలో అంతులేని సముద్ర సంపద ఉంది. అందుకే ఈ దీవులపై పట్టు కోసం చైనా, వియత్నాం, తైవాన్‌, ఫిలిప్పీన్స్‌, మలేసియా, బ్రూనే దేశాలు ప్రయత్నిస్తుంటాయి. అంతే కాదు.. ఇవి తమ చారిత్రక  హక్కుగా అనేక దేశాలు చెప్పుకుంటున్నాయి. చివరకు ఈ విషయం అంతర్జాతీయ న్యాయస్థానం వద్దకు వెళ్లింది. 2016లో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం చైనాకు దక్షిణ చైనా సముద్రంపై  ఎలాంటి హక్కూ లేదని తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును చైనా అంగీకరించడం లేదు.

తాజాగా ఏమైందంటే.. పరాసెల్స్‌ దీవుల వద్ద సముద్ర జలాల్లోకి వచ్చిన అమెరికా యుద్ధనౌకను చైనా తరిమికొట్టింది. ఈ విషయాన్ని సోమవారం స్వయంగా చైనా సైన్యం ప్రకటించింది. అమెరికాకు చెందిన బెన్‌ఫోల్డ్‌ యుద్ధనౌక పరాసెల్స్‌ వద్ద తమ అనుమతి లేకుండా చొరబడిందని చైనా సైన్యం అంటోంది. అమెరికా చైనా సార్వభౌమత్వాన్ని ధిక్కరించిందని.. దక్షిణ చైనా సముద్రంలో తటస్థతకు భంగం కలిగించిందని అంటోంది. రెచ్చగొట్టే చర్యలను తక్షణమే నిలుపుదల చేయాలని అమెరికాను కోరింది.

అమెరికా మాత్రం  తమ ఓడను చైనా సైన్యం తరమడంపై ఏమీ స్పందించలేదు. కాకపోతే.. సముద్ర జలాల్లో స్వేచ్ఛకు సంబంధించి అన్నిదేశాలకు తమ శాశ్వత ప్రయోజనాలు ఉంటాయని అంటోంది. దక్షిణ చైనా సముద్రంలో జరుగుతున్నన్ని ఉల్లంఘనలు ఇంకెక్కడా చోటు చేసుకోవడం లేదని ఆరోపిస్తోంది. చైనా ఇతర ఆగ్నేయ ఆసియా దేశాలమీద పెత్తనం చెలాయిస్తోందని ఆరోపిస్తోంది. మరి ఈ వివాదం ఎలాంటి ఘర్షణలకు దారి తీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: