అప్పుడు ఈనాడు .. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ..! బాబుగారి పరిస్థితేమిటో?

Thanniru harish
తెలుగుదేశం పార్టీకి ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి పేప‌ర్ల‌కు అవినాభావ సంబంధం ఉంద‌న‌టంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. వైసీపీ పార్టీ నేత‌లు వీటికి ప‌చ్చ‌ప‌త్రిక‌లు అనిపేరుకూడా పెట్టారు. ఎన్టీఆర్ హ‌యాం నుంచి ఈనాడుతో స‌త్సంబంధాలు ఉన్నాయి. ఇటీవ‌ల ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఎన్టీఆర్ దెబ్బ‌తిన‌డంలో ముగ్గురు కీల‌క పాత్ర పోషించారంటూ పేర్కొన్నారు. వారిలో చంద్ర‌బాబు, ల‌క్ష్మీపార్వ‌తితో పాటు మ‌రొక‌రి పేరును ప్ర‌స్తావించారు. వీరికితోడు ఈనాడు దిన‌ప‌త్రిక పాత్ర‌కూడా ఉంద‌న్న వాద‌న‌లు ఉన్నాయి. ఎన్టీఆర్ గెలుపులో, ఆయ‌న హ‌యాంలో పార్టీ బ‌లోపేతంలో ఈనాడు కీల‌క భూమిక పోషించింద‌నేది ప్ర‌చారంలో ఉంది. అది ఎంత‌వ‌ర‌కు నిజ‌మోకాదో కానీ.. ఎన్టీఆర్ ఒకానొక ద‌శ‌లో ఈనాడు అధినేత మాట‌కూడా విన‌లేద‌ని, దీంతో ఎన్టీఆర్‌ను గ‌ద్దెదింప‌డంలో ఈనాడు కీల‌క పాత్ర పోషించింద‌ని ఇప్ప‌టికీ పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.
చంద్ర‌బాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత‌గా, సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లు అండ‌గా నిలుస్తూ వ‌స్తున్నాయి. ఏదైనా అవ‌స‌ర‌ముంటే రామోజీరావు స‌ల‌హాలు, సూచ‌న‌లు చంద్ర‌బాబు తీసుకుంటార‌ని ప‌లు సంద‌ర్భాల్లో ఆపార్టీ నేత‌లు పేర్కొంటుంటారు. ఇక్క‌డ ప్ర‌స్తుత విష‌యం ఏమిటంటే.. ఈనాడు ప‌త్రిక గ‌త కొద్దిరోజులుగా న్యూట్ర‌ల్‌గా ఉంటూ వ‌స్తోంది. వైసీపీ ప్ర‌భుత్వంపై ఒక‌ప‌క్క విమ‌ర్శ‌లు చేస్తూనే.. మ‌రోప‌క్క వైసీపీ వార్త‌ల‌ను, సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కార్య‌క్ర‌మాల‌ను క‌వ‌ర్‌చేసుకుంటూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో టీడీపీ త‌ర‌పున‌ ఆంధ్ర‌జ్యోతి పూర్తిగా బాధ్య‌త‌లు తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది.
ఇటీవ‌ల చంద్ర‌బాబు నాయుడు ప‌లు విష‌యాల్లో బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో బీజేపీ నుంచి తీవ్ర వ్య‌తిరేఖ‌త వ‌చ్చింది. చంద్ర‌బాబుతో క‌లిసేది లేదంటూ రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి స్వ‌యంగా ప్ర‌క‌టించారు. దీంతో ఆంధ్ర‌జ్యోతి కొత్త నినాదాన్ని ఎత్తుకుంది. బీజేపీతో పొత్తు వ‌ద్దంటూ ప‌లువురు పార్టీ సీనియ‌ర్ నేత‌ల వాయిస్‌ను హైలెట్ చేస్తోంది. ఈ క్ర‌మంలో ఒక‌ప్పుడు తెదేపా మంత్రి, అనంత‌రం ఆ పార్టీని వీడి, ప్ర‌స్తుతం రైతుల సంఘాల పేరుతో ఉద్య‌మాలుచేసే వ్య‌క్తి వ‌డ్డె శోభ‌నాదీశ్వ‌ర్‌రావు బీజేపీ మ‌ద్ద‌తు ఇవ్వొద్దూ అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆంధ్ర‌జ్యోతి హైలెట్ చేసింది. ప‌లువురు తెదేపా నేత‌ల వాయిస్‌ను హైలెట్ చేసేలా ఆంధ్ర‌జ్యోతీ తీరు క‌నిపిస్తుంది. దీంతో తెదేపా ఎవ‌రితో పొత్తుపెట్టుకోవాలో, ఎవ‌రితో పొత్తు పెట్టుకోవ‌ద్దో నిర్ణ‌యాన్ని ఆంధ్ర‌జ్యోతి అధినేత డిసైడ్ చేసే ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ట్లు క‌నిపిస్తుంది.
గ‌తంలో ఎన్టీఆర్ నామాటే వినాల‌న్న రీతిలో ఈనాడు వ్య‌వ‌హ‌రించింద‌ని, ప్ర‌స్తుతం అదేరీతిలో ఆంధ్ర‌జ్యోతి వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న వాద‌న ప‌లువురు తెదేపా నేత‌ల నుండి వ్య‌క్త‌మ‌వుతుంది. ఈ ప‌రిణామాల‌తో చంద్ర‌బాబు ప‌రిస్థితి ఏమౌతుందో అంటూ ప‌లువురు వైసీపీ నేత‌లు చ‌ర్చించుకోవ‌టం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: