ఎన్టీఆర్ అడ్డాలో మార్పు కావాల్సిందేనా?

M N Amaleswara rao

కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామం...టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత నేత ఎన్టీఆర్ పుట్టిన గ్రామం అని అందరికీ తెలిసిందే. ఇక ఈ గ్రామం, పామర్రు నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. అయితే ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అయిన పామర్రులో ఇంతవరకు టీడీపీ జెండా ఎగరలేదు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఏర్పడిన పామర్రు నియోజకవర్గానికి మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. మూడుసార్లు టీడీపీ ఓడిపోయింది.


2009లో టీడీపీ తరుపున ఉప్పులేటి కల్పన పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి డి‌వై దాస్ పోటీ చేశారు. అనూహ్యంగా దాస్ గెలిచారు. ఇక 2014 ఎన్నికల ముందు కల్పన వైసీపీలోకి వెళ్లారు. దీంతో 2014 ఎన్నికల్లో కల్పన వైసీపీ నుంచి పోటీ చేసి, అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసిన వర్ల రామయ్యపై కేవలం వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో కల్పన వైసీపీని వీడి, చంద్రబాబు చెంత చేరారు.


ఇక అధికారంలో ఉన్నన్ని రోజులు పార్టీలో కనిపించిన కల్పన 2019 ఎన్నికల్లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. వైసీపీ నుంచి పోటీ చేసిన కైలే అనిల్ కుమార్ భారీ మెజారిటీతో గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ పామర్రులో దూసుకెళుతున్నారు. ప్రభుత్వ పథకాలు బాగా అడ్వాంటేజ్ అవుతున్నాయి. ఇక ఇటు టీడీపీలో ఉన్న కల్పన మాత్రం పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. నియోజకవర్గంలో సమస్యలపై గళం విప్పడం లేదు. వైసీపీపై పెద్దగా ఫైర్ అయిన సందర్భాలు కూడా తక్కువే.


ఇలా కల్పన సరిగ్గా లేకపోవడంతో టీడీపీ కేడర్ వైసీపీలోకి పోతుంది. ఇప్పటికే పామర్రులో టీడీపీ వీక్ అయిపోయింది. దీంతో కల్పన ఉంటే పార్టీకే ఇబ్బంది అని, ఆమెని మార్చేయాలని కొందరు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో కల్పన బదులు వర్ల రామయ్యని ఇన్‌చార్జ్‌గా పెడితే పార్టీ కాస్త బాగుపడుతుందని అంటున్నారు. మరి చూడాలి పామర్రు టీడీపీలో ఎలాంటి మార్పులు వస్తాయో. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: