కరోనా తొలి పేషెంట్ ని చైనా దాచేసిందా..?

Deekshitha Reddy
కరోనా గురించి చైనా చెబుతున్నవన్నీ అవాస్తవాలేననే ప్రచారం మళ్లీ ఇప్పుడు జోరందుకుంది. కరోనా యాధృచ్ఛికంగా వచ్చిన వైరస్ కాదని, కచ్చితంగా మానవ ప్రయత్నంతో ముడిపడి ఉన్న వైరస్ అని అంతర్జాతీయ మీడియా హోరెత్తిస్తోంది. ఈ దశలో అసలు కరోనా వచ్చిన తొలి పేషెంట్ విషయంలో కూడా చైనా అసత్యాలు ప్రచారం చేసిందని తాజా నివేదిక వెల్లడిస్తోంది. అవును.. ఇప్పటి వరకూ కరోనా తొలి పేషెంట్ ఓ మహిళ అని, వుహాన్ లోని మార్కెట్లో ఆమె వ్యాపారం చేసేవారని మాత్రమే చైనా బాహ్యప్రపంచానికి తెలియజేసింది. 2019 డిసెంబర్ లో తర్వాతే కరోనా సోకిన ఆ మహిళను పేషెంట్ జీరోగా ప్రపంచానికి చెప్పింది చైనా. కానీ ఇప్పుడు 'పేషెంట్ సు' అనే కొత్త పేరు ప్రచారంలోకి వచ్చింది.
ఎవరీ 'పేషెంట్ సు'..?
చైనాలో కరోనా సోకిన తొలి వ్యక్తి, అంటే పేషెంట్ జీరోగా పిలవాల్సిన అసలు వ్యక్తి 'పేషెంట్ సు' అని అంటున్నారు. 2019 సెప్టెంబర్ లోనే సదరు 'పేషెంట్ సు'కి కొవిడ్ సోకినట్టు, ఆ తర్వాత అతడికి వుహాన్ లోని రోంగ్జిన్ ఆస్పత్రిలో చికిత్స జరిగినట్టు కొన్ని ఆధారాలు లభించాయి. అయితే ఆ రోగికి ఎలాంటి పరీక్షలు చేయలేదు, కొవిడ్ లక్షణాలతో రోజుల వ్యవధిలోనే చనిపోయారు. వుహాన్ యూనివర్శిటీ బయోస్టాటిక్స్ ప్రొఫెసర్ 'యు చున్హువా'.. హెల్త్ టైమ్స్ అనే చైనీస్ మెడికల్ మేగజీన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయాలు బయటపడ్డాయి.
కరోనా గురించి చైనా బయటపెట్టడానికి మూడు వారాల ముందే ఆ దేశంలో కరోనా కేసులు ఉన్నాయని కానీ చైనా ఆ విషయాన్ని దాచిపెట్టినట్టు ప్రొఫెసర్ 'యు చున్హువా' ఇంటర్వ్యూ ద్వరా తెలుస్తోంది. అయితే 'పేషెంట్ సు' కి ఆ వ్యాధి ఎలా సోకిందనేదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. వుహాన్ లో గబ్బిలాలపై పరిశోధన చేసే ల్యాబొరేటరీకి అతి సమీపంలో 'పేషెంట్ సు' ఉండేవారని, ఆ సాన్నిహిత్యం వల్లే వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. అయితే ఆ ల్యాబొరేటరీకి 'పేషెంట్ సు' కి ఉన్న సంబంధం ఏంటి? అందులో పనిచేసేవారా? లేదా? అనే విషయాలు మాత్రం బయటకు రాలేదు.
అయితే రోంగ్జిన్ ఆస్పత్రిలో ఎలాంటి రికార్డులు లేవు కాబట్టి.. ఆ ప్రొఫెసర్ చెప్పినట్టు 'పేషెంట్ సు'నే పేషెంట్ జీరో అని చెప్పలేమని డెయిలీ మెయిల్ తెలిపింది. కానీ ఆ అడ్రస్ పట్టుకుని వెదికితే.. సదరు 'పేషెంట్ సు' ఓ మహిళ అని, గబ్బిలాల పరిశోధన ల్యాబొరేటరీల పక్కనే ఆమె నివాసం ఉండేదని తేలింది. దీంతో ప్రొఫెసర్ ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనంగా మారింది. పేషెంట్ జీరో విషయంలో చైనా ఇప్పటి వరకూ చెప్పిందంతా అబద్ధమేననే అనుమానాలు బలపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: