కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు....జగన్ సాధ్యం చేస్తారా?

M N Amaleswara rao
2019 ఎన్నికల ముందు జగన్ చేసిన పాదయాత్ర జనాలు ఎవరూ మర్చిపోరు. పెద్ద ఎత్తున జగన్ పాదయాత్ర చేసి, ఎక్కడికక్కడే ప్రజల సమస్యలు తెలుసుకుని ముందుకు కదిలారు. అదే సమయంలో ప్రజలకు పలు హామీలు కూడా ఇచ్చారు. తనని గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటానని నమ్మకం కలిగించారు. జగన్ చెప్పినట్లుగానే 2019 ఎన్నికల్లో జగన్‌కు ఓట్లు వేసి గెలిపించారు. అనుకున్న విధంగానే జగన్ సీఎం అయిపోయారు.
ఇక సీఎం అయ్యాక వరుస పెట్టి తాను ఇచ్చిన హామీలని అమలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయిపోయింది. ఈ రెండేళ్ల కాలంలో చాలా హామీలనే అమలు చేశారు. అయితే కొన్ని హామీలు పెండింగ్‌లో పడిపోయినట్లున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ ఆ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా హామీ ఇచ్చారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది. కానీ ఇంతవరకు ఆ హామీ గురించి చర్చ చేసిన సందర్భం లేదు.
అయితే తమ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కృష్ణా జిల్లా ప్రజలు పెద్దగా కోరుకున్న సందర్భాలు తక్కువ. ఏదో కొందరు ప్రజలు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే బాగుంటుందని డిమాండ్ తీసుకొచ్చారు. ఇక టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీనిపై ఇంత చర్చ జరగలేదు. కానీ జగన్ పాదయాత్ర సమయంలో కృష్ణా జిల్లాకు వచ్చి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెడతానని హామీ ఇచ్చారు.
పలు రాజకీయ కారణాలతోనే జగన్ అప్పుడు హామీ ఇచ్చారని చెప్పొచ్చు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ రాజకీయం సక్సెస్ అయింది. కృష్ణా జిల్లాలో 16 సీట్లలో వైసీపీ 14 గెలుచుకుంది. అటు ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. ఇక జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయిపోయింది. ఈ క్రమంలోనే జిల్లాలో పలువురు నాయకులు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎప్పుడు పెడతారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు ఈ విషయంపై గట్టిగా పట్టుకుని జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు పొందడానికే జగన్ ఆ హామీ ఇచ్చారని, అది నమ్మి ప్రజలు ఓట్లు వేసి మోసపోయారని అంటున్నారు. మరి చూడాలి రానున్న మూడేళ్లలో అయినా జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతారేమో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: