కృష్ణాలో నాని డామినేషన్ ఎక్కువ ఉందా?

M N Amaleswara rao

కొడాలి నాని....ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు.  నాలుగు సార్లు వరుసగా గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్న నానికి, కృష్ణా జిల్లా రాజకీయాలపై మంచి పట్టు ఉంది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నానికి...సొంత ఇమేజ్ ఎక్కువే. ఆ ఇమేజ్ వల్లే గుడివాడలో ప్రత్యర్ధి ఎవరైనా సరే, గెలుపు మాత్రం ఈయనకే దక్కుతుంది. అయితే రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన నాని, రెండుసార్లు వైసీపీ నుంచి గెలిచారు. ఇక ఇప్పుడు జగన్ కేబినెట్‌లో కీలకంగా పనిచేస్తున్నారు.


ఈయన మీడియా సమావేశం పెడితే చాలు ప్రత్యర్ధులు కంగారు పడాల్సిందే. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ నాయకులకు కొడాలి నాని చుక్కలు చూపిస్తుంటారు. తమ ప్రభుత్వంపై గానీ, తమ సీఎం జగన్‌పైన గానీ టీడీపీ నాయకులు విమర్శలు చేస్తే, వెంటనే రంగంలోకి దిగేసి కౌంటర్లు ఇచ్చేస్తారు. ఏ మాత్రం మొహమాటం లేకుండా పరుష పదజాలం సైతం వాడుతూ, చంద్రబాబు అండ్ బ్యాచ్‌పై విరుచుకుపడతారు. ఇలా టీడీపీకి నాని చెక్ పెడుతూ, ఈ రెండేళ్లలో బాగా హైలైట్ అయ్యారు.


అయితే ఈయన స్థాయిలో కృష్ణా జిల్లాలో మరో వైసీపీ నాయకుడు హైలైట్ కాలేదు. కాకపోతే కొడాలి నాని తర్వాత, మంత్రి పేర్ని నాని సైతం బాగానే హైలైట్ అయ్యారు. ఈయన కూడా తనదైన శైలిలో వెటకారంగా మాట్లాడుతూ, ప్రతిపక్ష టీడీపీకి చెక్ పెడతారు. ఇలా ఈ ఇద్దరు మంత్రులు కృష్ణా జిల్లా రాజకీయాల్లోనే బాగా హాట్ టాపిక్ అవుతున్నారు. వీరి మధ్యలో మరో వైసీపీ నాయకుడు పెద్దగా హైలైట్ అయిన సందర్భాలు లేవు.


జిల్లాలో వైసీపీ తరుపున 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. ఇందులో కొడాలి నాని, పేర్ని నానీని పక్కనబెడితే, వేరే వైసీపీ ఎమ్మెల్యే పెద్దగా పోలిటికల్ స్క్రీన్‌పై సందడి చేయలేదు. అయితే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ రాజకీయాల వరకు బాగానే కనిపిస్తున్నారు. మొత్తానికైతే కృష్ణాలో కొడాలి హవా ఎక్కువ ఉందని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: