కేసీఆర్‌, జ‌గ‌న్ పంతం నిలువునా ప్రాణాలు తీస్తోందా ?

VUYYURU SUBHASH
ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌ఖ్య‌త బెడిసికొట్టిందా? ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఖ‌చ్చితంగా ఏడాది కింద‌ట ఉన్న స్నేహం .. నేడు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీలకులు. ఏపీ సీఎంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ చూడాల‌న్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. 2019 ఎన్నిక‌ల్లో త‌న‌కు తోచిన విధంగా జ‌గ‌న్ సీఎం అయ్యేందుకు స‌హ‌క‌రించార‌నే వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్ప‌టికీ చ‌ర్చ‌గానే ఉంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబును గ‌ద్దెదింప‌డ‌మే ల‌క్ష్యంగా కేసీఆర్‌, ఆయ‌న మంత్రి వ‌ర్గం కూడా ఎంతో కృషి చేశాయ‌ని అంటారు. ఈ క్ర‌మంలోనే సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి కూడా కేసీఆర్ హాజ‌ర‌య్యారు.

దీంతో ఇరు రాష్ట్రాల మ‌ధ్య సుహృద్భావ వాతావ‌ర‌ణ పాదుకొల్పుకుంద‌ని.. ఇక‌, ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా తీరిపోతాయ‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలో గోదావ‌రిన‌ది నీటిని ఎక్కువ‌గా వినియోగించుకుందామంటూ.. కేసీఆర్ చేసిన ప్ర‌తిపాద‌న‌కుమొద‌ట్లో సీఎం జ‌గ‌న్ తలూపారు. అయితే.. దీనిపై విప‌క్షాల నుంచి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లురావ‌డంతో ఆయ‌న వెన‌క్కి త‌గ్గారు. ద‌రిమిలా.. ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య నీటి కోసం పంతంతో కూడిన రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కాళేశ్వ‌రానికి అస‌లు అనుమ‌తులే లేవ‌ని జ‌గ‌న్ ఫిర్యాదు చేయ‌డంతో.. కేసీఆర్ కూడా అదేరేంజ్‌లో శ్రీశైలంలో ఉన్న నీటిని మొత్తంగా మేమే వాడుకుంటాం.. అన్నారు.

ఇక‌, రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌ను ఆపాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు.దీంతో ఇరు రాష్ట్ర ముఖ్య‌మంత్రుల మధ్య కొన్నాళ్లుగా మాట‌లే లేకుండా పోయాయి. అయితే.. ఇప్పుడు ఈ పంతం అటు తిరిగి ఇటు తిరిగి క‌రోనా బాధితుల ప్రాణాల‌మీద‌కు తెచ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. హైద‌రాబాద్‌లో అధునాత‌న వైద్య సౌక‌ర్యాలు ఉండడంతో ఏపీ నుంచి కొన్ని రోజులుగా తెలంగాణ‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. కేసీఆర్ స‌ర్కారు వీరిపై క‌న్నెర్ర చేసింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ.. ఏపీ నుంచి వ‌చ్చే రోగుల‌ను అనుమ‌తించేంది లేద‌ని భీష్మించారు. దీనిపై తెలంగాణ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా.. ఆయ‌న మాత్రం మార‌డం లేదు.

అయితే.. దీనిని ఇద్ద‌రు సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటే.. స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని సూచ‌న‌లు వ‌స్తున్నా.. ఎవ‌రూ కూడా స్పందించ‌డం లేదు. ఇక‌, ఇలా స‌రిహ‌ద్దుల్లో ఆపు తున్న అంబులెన్సుల్లోనే ఇప్ప‌టి వ‌ర‌కు పాతిక మంది .. చ‌నిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు నీటి విష‌యంలో త‌లెత్తిన ర‌గ‌డ‌తో మౌనం పాటించ‌డాన్ని ప్ర‌జ‌లు తీవ్రంగా భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా ఇరువురు దిగివ‌స్తారో లేదో .. చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: