దేశమా 'ఊపిరి' పీల్చుకో.. సముద్రం నుంచి 'ప్రాణం' వస్తోంది..

Chakravarthi Kalyan
ఆక్సిజన్.. ఆక్సిజన్.. ఆక్సిజన్.. ఇప్పుడు ఇండియా ఊపిరి కోసం తండ్లాడుతోంది. ప్రాణవాయవు లేక భారత్ దేశం ఊపిరి ఆగుతోంది.. కరోనా కారణంగా ఊపిరితిత్తుల్లో సమస్యలతో ఊపిరి ఆడని అనేక మంది ఆక్సిజన్ సౌకర్యం లేక ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలోని పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఆక్సిజన్ అందక.. ధనిక, పేద తేడాలు లేక జనం ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

దేశానికి పొంచి ఉన్న ప్రాణవాయువు అవసరాన్ని ఆలస్యంగా గుర్తించిన కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో ఆక్సిజన్ తీసుకొస్తోంది. భారత నౌకాదళం సేవలను కూడా ఆక్సిజన్ తరలింపు కోసం వాడుతోంది. తాజాగా తొమ్మిది యుద్ధనౌకల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు, భారీ ఆక్సిజన్‌ ట్యాంకర్లు, కొన్ని రకాల వైద్య పరికరాలను భారతదేశానికి వస్తున్నాయి. ఈ మేరకు తూర్పు నౌకాదళ అధికారులు తెలిపారు.

ఆక్సిజన్ కోసం నౌకాదళం సముద్రసేతు-2 పేరుతో కొవిడ్‌ సహాయ చర్యలను చేపట్టింది. ఆక్సిజన్‌ కొరత తీర్చడానికి పర్షియన్‌ గల్ఫ్‌, ఆగ్నేయాసియా ప్రాంతాల్లోని భారత స్నేహపూర్వక దేశాలు ముందుకు వస్తున్నాయి. బహ్రెయిన్‌ నుంచి  27 టన్నుల సామర్థ్యం గల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు రెండింటితో ఐ.ఎన్‌.ఎస్‌.తల్వార్‌ యుద్ధనౌక మంగళూరు నౌకాశ్రయానికి చేరుకున్నాయి.

అలాగే ఐ.ఎన్‌.ఎస్‌.కోల్‌కతా అనే మరో యుద్ధనౌక కువైట్‌ నుంచి రెండు 27 టన్నుల ఆక్సిజన్‌ ట్యాంకర్లు, 400 ఆక్సిజన్‌ సిలిండర్లు, 47 కాన్సన్‌ట్రేటర్లతో బయలుదేరింది. మరో నాలుగు యుద్ధనౌకలు కువైట్‌, ఖతార్‌ల నుంచి తొమ్మిది 27 టన్నుల ఆక్సిజన్‌ ట్యాంకులు, 1,500 ఆక్సిజన్‌ సిలిండర్లను తీసుకువస్తున్నాయి.  ఐ.ఎన్‌.ఎస్‌.ఐరావత్‌ యుద్ధనౌక బుధవారం సింగపూర్‌ నుంచి ఎనిమిది 27టన్నుల ఆక్సిజన్‌ ట్యాంకులు, 3,600 ఆక్సిజన్‌ ట్యాంకులు తీసుకొస్తోంది.
ఇటీవల ఆక్సిజన్ కొరత తీర్చేందుకు  కేంద్రం ఓ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది.  విదేశాల నుంచి భారీగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను  రప్పిస్తోంది. విదేశాల్లోని కాన్సన్‌ట్రేటర్లను ఎయిరిండియా ద్వారా కూడా వాయు మార్గంలో కేంద్రం ఆక్సిజన్ రప్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: