ఆశ‌ల గ‌ల్లంతు.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఓట‌ర్లు

Thanniru harish
నాగార్జున సాగ‌ర్ ఉపఎన్నిక‌ల్లో గెలుస్తామ‌న్న ధీమాతో ఉన్న కాంగ్రెస్‌కు ఓట‌ర్లు షాకిచ్చారు. ఆ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత జానారెడ్డి ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు నిరాశ‌కు గుర‌వుతున్నారు. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో మొత్తం 25 రౌండ్‌ల‌కు గాను 23 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్త‌య్యే స‌రికి టీఆర్ ఎస్ అభ్య‌ర్థి దాదాపు 17వేల ఓట్ల ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. దీంతో జానారెడ్డి గెలుపుపై ఆశ‌లు స‌న్న‌గిల్లాయి. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి త‌ద్వారా రాష్ట్రంలో బ‌లోపేతం అయ్యేందుకు కాంగ్రెస్ అధిష్టానం క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టింది. ఈ క్ర‌మంలో జానా ఓట‌మి ఆ పార్టీకి గ‌ట్టి షాకినిచ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు.
ప్ర‌త్యేక తెల‌గాణ ఏర్పాటు త‌రువాత కాంగ్రెస్ గ్రాఫ్ ప‌డిపోతూ వ‌స్తుంది. ప్ర‌ధానంగా 2018లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 19మంది కాంగ్రెస్ అభ్య‌ర్థులు గెలుపొందారు. వారిలో అనేక మంది అధికార పార్టీలో చేరిపోయారు. అప్ప‌టి నుంచి ఏ ఎన్నిక జ‌రిగినా కాంగ్రెస్ త‌న ప్రాబ‌ల్యాన్ని కోల్పోతూ వ‌స్తుంది. అధికార తెరాస పార్టీకి ఏ స్థాయిలోనూ పోటీ ఇవ్వ‌క‌లేక పోయింది. దీనికితోడు ఆ పార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త విబేధాలు కాంగ్రెస్‌ను కోలుకోలేకుండా చేస్తున్నాయి. టీపీసీసీ అధ్య‌క్షుడు విష‌యంలోనూ ఆ పార్టీలో ఉన్న కొద్దిమంది మ‌ధ్య పోటీ నెల‌కొన‌డంతో ఎవ‌రిని నియ‌మించ‌లేక అధిష్టానం వాయిదాలు వేస్తూ వ‌స్తుంది. అయితే నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల త‌రువాత టీపీసీసీ చీఫ్‌ను ప్ర‌క‌టిస్తామ‌ని ఆ పార్టీ అధిష్టానం పెద్ద‌లు తెలిపారు.
సాగ‌ర్‌లో జానారెడ్డి గెలుపు ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తూ వ‌చ్చారు. ప్ర‌చారంసైతం జోరుగా సాగించారు. గ్రామ గ్రామ ముఖ్య‌నేత‌లు పాగావేసి ఐక్యంగా జానారెడ్డి గెలుపుకోసం ముందుకు సాగారు. అయినా నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్లు మాత్రం కాంగ్రెస్‌ను విశ్వ‌సించ‌లేదు. అధికార పార్టీవైపే మొగ్గుచూపారు. జానారెడ్డి సొంత మండ‌లంలోసైతం కాంగ్రెస్‌కు మెజార్టీ రాక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఈ ఫ‌లితంతో పార్టీలో ఉన్న కొద్దిమంది నేత‌ల్లో మ‌రికొంత మంది కాంగ్రెస్ వీడుతార‌న్న ప్ర‌చారం సాగుతుంది. మొత్తానికి నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు కాంగ్రెస్‌కు గ‌ట్టి షాక్ ఇచ్చాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: