సోలార్ విద్యుత్‌లో సింగ‌రేణి రికార్డులు....డిసెంబ‌ర్ నాటికి 300 మెగావాట్లు..

Spyder

సింగరేణి సంస్థ సింగరేణి వ్యాప్తంగా మూడు దశల్లో నిర్మిస్తున్న సోలార్‌ ప్లాంటుల్లో ఇప్పటికే మొదటి దశలోని నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చాయి. మణుగూరు నుండి 30 మెగావాట్లు, రామగుండం-3 నుండి 30 మెగావాట్లు, ఇల్లందు నుండి 15 మెగావాట్లు, సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని సోలార్‌ ప్లాంటు నుండి 10 మెగావాట్లు ఇప్పటికే ట్రాన్స్‌ కో కు అనుసంధానం అయినాయి. తొలి దశలో ఇంకా మిగిలి ఉన్న 44 మెగావాట్లను వచ్చే నెల చివరికల్లా అనుసంధానం చేయాలని, రెండవ దశలోని 90 మెగావాట్ల ప్లాంటు నిర్మాణం మే, 2021 చివరి కల్లా పూర్తి చేయాలని  ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ సోలార్‌ విభాగం అధికారులను ఆదేశించారు. 3వ దశలో నిర్మించే 81 మెగావాట్ల ప్లాంటుల నిర్మాణం కూడా ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని తద్వారా మొత్తం 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్తును అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
రామగుండం రీజియన్‌ మొత్తం విద్యుత్తు వినియోగంలో 30 శాతం సోలార్‌ ప్లాంటు ద్వారానేరామగుండం-3 సోలార్‌ ప్లాంటులో బుధవారం  15 మెగావాట్ల విభాగాన్ని డైరెక్టర్‌ ఇ&ఎం. శ్రీ డి.సత్యనారాయణ రావు, ట్రాన్స్‌ కో సబ్‌ స్టేషన్‌ కు అనుసంధానం చేశారు. 50 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు ఫిబ్రవరి చివరి నుండి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తే రామగుండం రీజియన్‌ లోని 3 ఏరియా విద్యుత్‌ వినియోగంలో 30 శాతం విద్యుత్తును ఈ సోలార్‌ ప్లాంటు ద్వారానే సమకూర్చుకోనున్నారు. తద్వారా నెలకు 178 లక్షల రూపాయలు, ఏడాదికి 21 కోట్ల రూపాయలు కంపెనీకి ఆదా కానున్నాయి. రామగుండం రీజియన్‌ పరిధిలో రామగుండం-1,2,3 ఏరియాలోని 4 ఓ.సి. గనులతో పాటు ఆసియాలోనే అతిపెద్దదైన లాంగ్‌ వాల్‌, ఓ.సి.-2 గనిలో ఇన్‌ పిట్‌ క్రషర్‌ & కన్వేయర్‌ టెక్నాలజీ ఉంది. 3 ఏరియాలలోని యంత్ర అవసరాల కోసం నెలకు 2 కోట్ల 20 లక్షల యూనిట్ల విద్యుత్తును కంపెనీ వినియోగిస్తుంది.

అలాగే 3 ఏరియాలలో గల అనేక నివాస కాలనీలకు నెలకు 40 లక్షల యూనిట్ల విద్యుత్తు అవసరమవుతోంది. గృహ మరియు యంత్ర అవసరాల కోసం కలిపి కంపెనీ నెలకు 2 కోట్ల 60 లక్షల యూనిట్ల విద్యుత్తును టి.ఎస్‌. ట్రాన్స్‌ కో నుండి కొనుగోలు చేస్తోంది. యూనిట్‌ రేటు సగటున 6 రూపాయల చొప్పున నెలకు 15.60 కోట్ల రూపాయలను విద్యుత్తు కోసం కంపెనీ ఖర్చు చేస్తోంది. కాగా 50 మెగావాట్ల ప్లాంటు నుండి పూర్తి స్థాయి సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తి అయితే దీని నుండి నెలకు 72 లక్షల యూనిట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు ట్రాన్స్‌ కో నుండి విద్యుత్‌ కొనుగోలును సింగరేణి సంస్థ తగ్గించగలుగుతుంది. సోలారు విదుత్తు ఉత్పత్తి ఖర్చు యూనిట్‌ కు కేవలం 3.54 రూపాయలు మాత్రమే కనుక సగటున నెలకు 178 లక్షల రూపాయలు ఏడాదికి 21 కోట్ల రూపాయలు సింగరేణికి ఆదా కానున్నాయి.

సింగరేణి సంస్థ తొలి దశలో ఇప్పటికే 4 చోట్ల ప్రారంభించిన 70 మెగావాట్ల సోలార్‌ విభాగాల నుండి జనవరి 19వ తేదీ నాటికి 21.77 మిలియను యూనిట్ల సోలార్‌ విద్యుత్తును ఉత్పత్తి చేసింది. ఈ మేరకు ట్రాన్స్‌ కో నుండి వాడే విద్యుత్తు వినియోగాన్ని తగ్గించగలిగింది. తద్వారా ఇప్పటికే 570 లక్షల రూపాయలు ఆదా చేయగలిగింది. వీటిలో సింగరేణి థర్మల్‌ ప్లాంటులో నెలకొల్పిన 10 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు ద్వారా 2020 జనవరి 10 నుండి ఇప్పటి వరకూ 10 మిలియను యూనిట్లు, మణుగూరులోని 30 మెగావాట్ల ప్లాంటు ద్వారా 2020 జూలై 30వ తేదీ నుండి ఇప్పటి వరకూ 10.66 మిలియను యూనిట్లు, రామగుండం-3లోని 15 మెగావాట్ల విభాగం ద్వారా నవంబర్‌ 27వ తేదీ నుండి ఇప్పటి వరకూ 7 లక్షల 60 వేల యూనిట్లు, ఇల్లందు లోని 15 మెగావాట్ల ప్లాంటు ద్వారా గత నెల 9వ తేదీ నుండి ఇప్పటి వరకూ 2 లక్షల 90 వేల యూనిట్ల సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తి జరిగింది. మొదటి దశలో 129 మెగావాట్లలో మిగిలిన 44 మెగావాట్ల నిర్మాణం ఫిబ్రవరి కల్లా పూర్తవనున్న నేపథ్యంలో ఈ దశ ప్లాంటు నుండి పూర్తి స్థాయిలో మార్చి నెల నుండి నెలకు 18.55 మిలియను యూనిట్ల సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తికానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: