ఎస్సై పై మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేసిన కర్నూలు బీజేపీ నేతలు...

SS Marvels
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య యుద్ద వాతావరణం రోజురోజుకీ ముదురుతుంది. సాధారణంగా ఒక రాజకీయ పార్టీకి చెందిన నేతలు వేరొక రాజకీయ పార్టీకి చెందినా వారిపై విమర్శలు చేయటం అలాగే వారిపై ఫిర్యాదులు చేయటం సహజమే... కానీ ఇటీవలి కాలంలో ప్రభుత్వ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అధికార పార్టీకి అనుయాయులుగా మెలుగుతున్నారని, ఒకరకంగా వారి ప్రతినిధులుగా ప్రవర్తిస్తున్నట్లుగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ కర్నూలు జిల్లలో కూడా ఒక సంఘటన ఇలాంటిదే జరిగిందని తెలుస్తుంది. వైఎస్సార్‌సీపీలో చేరాలంటూ తమను ఎస్సై బెదిరిస్తున్నారని కర్నూలు జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ముచ్చుమర్రి ఎస్‌ఐ శ్రీనివాసులు తమను హింసిస్తున్నారని అదే ఊరికి చెందిన కరీం బాషా, జలీల్‌ బాషా, సయ్యద్‌ జలాల్‌ బాషాలు ఆరోపించారు. ఈ విషయంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలు జ్యోతి క్లారా, జాతీయ మైనారిటీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ అతీఫ్‌ రషీద్‌లకు ఫిర్యాదు చేశారు.

గతేడాది ఏప్రిల్‌లో లాక్‌డౌన్‌ సమయంలో మసీదు వివాదమంటూ పిలిచిన ఎస్‌ఐ శ్రీనివాసులు తనపై దాడి చేశారని ఆరోపించారు. బీజేపీని వీడి వైఎస్సార్‌‌సీపీలో చేరకపోతే గ్రామం వదిలి వెళ్లాలని.. తలపై రివాల్వర్‌ పెట్టి బెదిరించారన్నారు. మండల పరిషత్‌ ఎన్నికల్లో పోటీకి బీజేపీ తరఫున నామినేషన్‌ వేసినందుకు గతేడాది మే 19న తన ఇంటిపైకి 300 మందితో కలిసి వచ్చిన వైఎస్సార్‌సీపీ నేత సిద్ధార్థరెడ్డి దాడి చేశారని.. తనను, కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపర్చారన్నారు. ఈనెల 12న రైతులు, మార్కెట్‌ ఏజెంట్లతో తన ఇంటి దగ్గర సమావేశం నిర్వహించగా.. నాగరాజు అనే వ్యక్తి పెద్దగా కేకలు వేస్తుండడంతో దూరంగా వెళ్లమని కోరామని... అతను ఎస్‌ఐ శ్రీనివాసులును పిలుచుకువచ్చారన్నారు. ఎస్‌ఐ తనను, జలీల్‌బాషాను ఠాణాకు తీసుకువెళ్లి అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు కొట్టారని ఫిర్యాదు చేశారు. అప్పుడు కూడా వైఎస్సార్‌సీపీలో చేరాలని పదేపదే హెచ్చరించారన్నారు. తాము గాయపడినప్పటి ఫొటోలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ, మైనారిటీ కమిషన్‌కు అందజేశారు. ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని, సిద్ధార్థరెడ్డితోపాటు ఇతరులపై కేసులు నమోదు చేయాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: