ప్రధాని మోడీకి కోవిడా టీకా ఎప్పుడంటే?

SRISHIVA
దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతమైందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తొలి రోజు లక్షా 95 వేల మందికి పైగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు కోవిడ్ టీకా ఇచ్చామని తెలిపింది. అందులో అతి స్వలంగా కేవలం పదుల సంఖ్యలోనే చిన్న చిన్న సమస్యలు వచ్చినా.. అంతా కోలుకున్నారని తెలిపారు. తొలి దశలో ఫ్రంట్ లైన్ యోధులైన డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే టీకాను ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. రాజకీయ నాయకులు పలువురు తమతమ రాష్ట్రాల్లో తొలి టీకాను వేసుకుంటామని తెలిపినా, వారిని ఈ ప్రక్రియకు దూరంగా ఉంచింది.
      భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోవిడ్ టీకాను తీసుకోకపోవడంపై కొందరు ప్రశ్నించారు. పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు.. ఆ దేశంలో తొలి టీకాను తీసుకుని ప్రజల్లో భరోసా కల్పించారని.. నరేంద్ర మోడీ కూడా అలా చేస్తే దేశ ప్రజలకు మరింత భరోసా వచ్చేందని కొందరు కామెంట్ చేశారు. మోడీ టీకాను తీసుకుంటేనే ప్రజలకు టీకాపై నమ్మకం కలుగుతుంది అని సోషల్ మీడియాలోనూ కొందరు పోస్టులు పెట్టారు. అయితే ప్రధాని మోడీ కోవిడ్ టీకా అంశంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ క్లారిటీ ఇచ్చారు.  ఓ జాతీయ మీడియా చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. మోడీ టీకా విషయంలో ఎప్పటికప్పుడు సైంటిస్టులతో మాట్లాడుతూ, అప్ డేట్స్ తీసుకుంటూనే ఉన్నారని స్పష్టం చేశారు. కరోనా యోధులకు టీకా ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు మొదలైందని, ఇది ముగిసిన తరువాత, 50 ఏళ్లకు పైబడిన వారికి టీకాను ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించామని ఆయన అన్నారు. ఆ జాబితాలోనే ప్రధాని మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు ఉంటారని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
    మరోవైపు కరోనా టీకాను తీసుకున్న తరువాత స్వల్పంగా ఇన్ఫెక్షన్ బారిన పడినా పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని, అది శుభ సంకేతమేనని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వ్యాఖ్యానించారు. తొలి రోజున వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గులేరియా కూడా ఉన్నారు. కొంత ప్రతికూల రియాక్షన్ రావడం మంచిదేనని వ్యాఖ్యానించిన ఆయన, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ టీకాకు స్పందిస్తుందని చెప్పేందుకు ఇది సంకేతమని అన్నారు.టీకా తరువాత ప్రతికూల పరిస్థితులు వస్తే, యాంటీ బాడీస్ తయారవుతున్నట్టుగా భావించవచ్చని గులేరియా అన్నారు. తాను పూర్తి స్వస్థతతో ఉండి, వ్యాక్సిన్ తీసుకున్నానని, ఆపై గంటన్నర తరువాత కూడా ఎలాంటి ప్రభావమూ తనలో కనిపించలేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: