తమిళనాడులో ముగిసిన టార్చిలైట్ వివాదం..

Deekshitha Reddy
తమిళనాడులో టార్చిలైట్ కోసం జరిగిన పోరాటంలో కమల్ హాసన్ విజేతగా నిలిచారు. ఇకపై టార్చిలైట్ గుర్తు కేవలం కమల్ హాసన్ పార్టీకే చెందేలా ఎన్నికల సంఘం నిర్ణయించడంతో ఆయన పార్టీ మక్కల్ నీది మయ్యం కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కమల్ హాసన్ టార్చిలైట్ గుర్తుపైనే తమ అభ్యర్థుల్ని నిలబెట్టారు. అయితే తాజాగా ఆ టార్చిలైట్ ను తమిళనాడుకే చెందిన ఎంజీఆర్ మక్కల్ కచ్చి అనే పార్టీతోపాటు, పుదుచ్చేరిలోని ఎంఎన్ఎంకి కూడా ఎన్నికల సంఘం కేటాయించింది. దీంతో కమల్ హాసన్ న్యాయపోరాటానికి దిగారు. మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో ఈ వివాదానికి పరిష్కారం లభించింది.
మక్కల్ ‌నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌ కు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం టార్చి లైట్‌ గుర్తునే కేటాయించింది. మరో ఇతర రాజకీయ సంస్థలకు టార్చిలైట్ కాకుండా ఇతర గుర్తులు కేటాయించేందుకు సుముఖత చూపింది. అదే సమయంలో ఎంజీఆర్‌ మక్కల్‌ కచ్చి వ్యవస్థాపక అధ్యక్షుడు ‘ఎంజీఆర్‌’ విశ్వనాథన్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తమకు టార్చిలైట్ ఇవ్వలేకపోతే.. ఎంజీఆర్‌ విగ్రహం లేదా ఆయనతో దగ్గరి సంబంధం ఉండేలా మరేదైనా గుర్తును కేటాయించాలని కోరారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం.. కమల్ హాసన్ కి ఊరటనిచ్చింది.

ఎన్నికల్లో పోటీచేసేందుకు తమ పార్టీకే టార్చి‌లైట్‌ గుర్తు దక్కడంపై కమల్ ‌హాసన్‌ హర్షం వ్యక్తంచేశారు. ట్విట్టర్లో విడుదల చేసిన ప్రకటనలో తన సంతోషాన్ని పంచుకున్నారు. అణగారిన వర్గాల జీవన ప్రమాణాల మెరుగు కోసం పోరాటం చేసిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ పుట్టిన రోజు నాడు తమకు టార్చిలైట్ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘానికి, అందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. వెలుగును విస్తరిద్దాం అని పేర్కొన్నారు. మరోవైపు రజినీకాంత్ ని కలిసేందుకు కూడా కమల్ హాసన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రజినీ ఆస్పత్రినుంచి తిరిగొచ్చిన తర్వాత ఆయన్ను నేరుగా కలసి పరామర్శిస్తానని చెప్పారు కమల్ హాసన్. అప్పటినుంచి కమల్ రాజకీయ కార్యకలాపాలతోనే బిజీగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: