తెలంగాణలో మృగ‌రాజు సినిమా... ఆ రెండు చోట్లా...!

VUYYURU SUBHASH
అప్పుడెప్పుడో 2001లో వ‌చ్చిన చిరంజీవి మృగ‌రాజు సినిమా గుర్తుండే ఉంటుంది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా సంక్రాంతికి బాల‌య్య న‌ర‌సింహానాయుడుకు పోటీగా రిలీజ్ అయ్యి ఘోర‌మైన ప్లాప్ అయ్యింది. ఆ సినిమాలో చిరంజీవి సింహం కోసం వేట కొన‌సాగిస్తాడు. ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యి.. చివ‌ర‌కు ప‌ట్టుకుంటాడు. అయితే ఆ సినిమా సీన్లే ఇప్పుడు తెలంగాణ‌లో కూడా రిపీట్ అవుతున్నాయి. అయితే ఆ సినిమాలో సింహం కోసం వేట కొన‌సాగిస్తే ఇప్పుడు తెలంగాణ‌లో మాత్రం రెండు పులుల కోసం వేట కొన‌సాగుతోంది.

కొద్ది రోజులుగా తెలంగాణ‌లోని ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో పులులు ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి. ఇక ఇప్పుడు అటు కొమ‌రం భీంతో పాటు ఇటు సిరిసిల్ల జిల్లాలో రెండు పులులు అక్క‌డ ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ రెండు పులులు చిక్కిన‌ట్టే చిక్కి త‌ప్పించుకోవ‌డంతో ఇప్పుడు వీటిని ప‌ట్టుకునేందుకు ప‌క్క రాష్ట్రాల‌కు చెందిన వేట‌గాళ్ల‌ను పిలిపించాల్సిన ప‌రిస్థితి. ట్విస్ట్ ఏంటంటే సిరిసిల్ల జిల్లాలో ఓ పులి వ్య‌వ‌సాయ బావిలో ప‌డింది.. ఈ పులి ఎక్క‌డ‌కు త‌ప్పించుకోదులే అని అనుకుంటే... రాత్రికి రాత్రే పులి ఎస్కేప్ అయ్యింది. దీంతో ఈ పులి ఎక్క‌డ‌కు వెళ్లిందో.. ఎప్పుడు ఎవ‌రి మీద దాడి చేస్తుందో ? అని ఒక్క‌టే భ‌యం ప‌ట్టుకుంది.

ఇక కొమ‌రం భీం జిల్లాలో వ‌రుస‌గా పులులు ప‌త్తి చేల‌ల్లోకి, అడ‌వుల్లోకి వెళ్లిన వారిపై దాడి చేసి చంపేస్తున్నాయి. ఈ జిల్లాలో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ పులి అట‌వీ శాఖ అధికారుల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఇప్ప‌టికే ఈ పులి ఇద్ద‌రిని చంపేయ‌డంతో దీనికి మ్యాన్ ఈటర్ అని పేరు పెట్టారు. ఇక పులి తిరిగిన ప్రాంతాల్లో మొత్తం 10 బోన్లు పెట్టి.. దానికి ఎర వేసేందుకు లేగ దూడ‌ల‌ను కూడా పెడుతున్నారు. ఇక 100కు పైగా సీసీ కెమేరాలు పెట్టారు.

ఇక పులికి మ‌త్తు ఇచ్చేందుకు హైద‌రాబాద్ నుంచి షార్ప్ షూట‌ర్ల‌ను ర‌ప్పించ‌డంతో పాటు.. ఎంతో సుశిక్షితులు అయిన 100 మంది అధికారుల‌ను కూడా రంగంలోకి దింపారు. అయినా పులి దొర‌క‌డం లేదు. ఏదేమైనా ఈ రెండు పులులు ప్ర‌జ‌ల‌కు, అధికారుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: