కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు జగన్ లేఖ

Chowdary Sirisha
సంక్షుభిత లిబియాలో చిక్కుకున్న భారత జాతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌కు మంగళవారం రాసిన ఒక లేఖలో స్వదేశానికి తిరిగి వచ్చేందుకు డబ్బులు కాని వనరులు కాని లేక లిబియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వెయ్యి మందికి పైగా భారత జాతీయులు చిక్కుకున్నట్లు వెలువడిన వార్తలను ఆయన ఉటంకించారు. వీరిలో కర్నూలు జిల్లాకు చెందిన సుమారు 100 మంది కార్మికులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ‘’జీవనోపాధి కోసం ఇతర దేశాల్లో ఉన్న భారతీయుల భద్రత బాధ్యత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖదైనందున వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి భారతీయ కార్మికులు సురక్షితంగా స్వదేశానికి తిరిగివచ్చేలా చర్యలు తీసుకోవాలి’’ అని సుష్మా స్వరాజ్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. లిబియాలో చిక్కుకున్న భారతీయులలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ఇతర ప్రాంతాలకు, తెలంగాణకు చెందిన కార్మికులు అంత స్థితిమంతులు కారని, తమ కుటుంబాను పోషించడానికి వారు లిబియా వెళ్లారని జగన్ తన లేఖలో తెలిపారు. లిబియాలో కల్లోలం మొదలైన వెంటనే పశ్చిమ దేశాలు తమ జాతీయులను వెనక్కు రప్పించుకున్నాయని ఆయన తెలిపారు. లిబియాలో చిక్కడిపోయిన కార్మికుల కుటుంబాల ఆందోళన, ఆవేదనను వ్యక్తం చేయడానకే తాను ఈ లేఖ రాస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: