సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ సీనియర్...!

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు.  రాష్ట్రంలో ఇసుక మాఫియా వేల కోట్లు దోచేస్తూ, రాష్ట్ర ప్రగతికి అడ్డుపడుతోంది అని విమర్శించారు. 17 నెలలుగా ఇసుక మీద కమిటీలపై కమిటీలు వేసిన జగన్ అండ్ కో చివరకు వేల కోట్లు వెనకేసుకుంది అని ఆయన ఆరోపించారు. వరదలు తగ్గి, ఇసుక అందుబాటులో ఉన్నా కూడా సామాన్యుడికి ఇసుక అందుబాటులోకి రావడం లేదు అని మండిపడ్డారు. కొత్త విధానం పేరుతో తన వాళ్లకు ఇసుక కాంట్రాక్ట్ ను కట్టబెట్టి, సరికొత్త దోపిడీకి పాలకులు తెరలేపారని మండిపడ్డారు.
ఒకే సంస్థకు రాష్ట్రంలోని ఇసుక రీచ్ లన్నీ అప్పగిస్తే, పరిస్థితి చాలా దారుణంగా మారుతుందన్నారు. రేవుల్లో నుంచి ఇసుకను బయటకు తీసుకొచ్చే బోట్ మెన్ సొసైటీల  ఛార్జీలను, జగన్ ప్రభుత్వం టన్నుకు రూ.180 నుంచి రూ.525కు పెంచింది అని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడిగాము... పారదర్శకంగా చేస్తున్నామని చెబుతూనే, దోపిడీకి సిద్ధమయ్యారని మండిపడ్డారు. 17 నెలల్లో ఇసుక సీనరేజీపై గానీ, మైనింగ్ ద్వారా గానీ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయమెంతో తెలియచేస్తూ, శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేసారు.
ఆఖరికి ఇసుక సమస్య వల్ల పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం నిలిచిపోయిందని, విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలను, వై.వీ.సుబ్బారెడ్డి కోస్తా జిల్లాలను, సజ్జల రామకృష్ణారెడ్డి రాయలసీమ జిల్లాలను దోచుకుంటుంటే ఈప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? అని నిలదీశారు. గత ప్రభుత్వంలో నిర్మాణాలు చేసిన వారికే లక్షలాది రూపాయల పాతబిల్లులను ప్రభుత్వం నిలిపివేసింది అని ఆయన విమర్శించారు. లక్షా 50 వేల కోట్ల అప్పులు చేసి, దోచుకున్నది చాలక, ఇసుక సహా, కాలేజీలు, హస్పిటల్స్ ని కూడా వదలకుండా దోచుకుంటున్నారు అని మండిపడ్డారు. ఇసుక ధర ఇన్ని రెట్లు పెంచిన జగన్ ప్రభుత్వం, దానిపై వచ్చిన ఆదాయం ఎక్కడికెళ్లిందో చెప్పాలని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: