అమెరికా ఎన్నికల్లో కౌన్సిల్‌ మెంబర్‌గా నెల్లూరు వాసి విజయం

Malathiputhra
అగ్రరాజ్యమైన అమెరికాలో  ఇప్పుడు ఎన్నికల హడావిడి నడుస్తుంది .. రెండు పార్టీ నాయకుల మధ్య హోరాహోరీ  పోరాటం జరుగుతుంది ... ఎవరు గెలుస్తారు, ఎవరు వైట్ హౌస్ ని కైవసం చేసుకుంటారు అనేది తెలియాలంటే మరి కొద్దీ సమయం వరకు వేచి చూడాలి ... ఈ ఎన్నికల్లో భాగంగా  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి సత్తా చాటారు  . నెల్లూరు జిల్లాకు చెందిన చలంచెర్ల ఏడుకొండలు ఘన విజయం సాధించారు...అగ్రరాజ్యంలో మన వాసి గెలవడం అంటే మాములు విషయం కాదు మరి వివరాలలోకి వెళ్తే
కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫోల్సమ్ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీతో కౌన్సిల్‌ మెంబర్‌గా  నెల్లూరు జిల్లాకు చెందిన చలంచెర్ల ఏడుకొండలు ఎన్నిక అయ్యారు. సామాన్య గిరిజన కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి అగ్రరాజ్య రాజకీయాల్లో చక్రం తిప్పారు...
నెల్లూరు జిల్లా విడవలూరులోని సామాన్య గిరిజన కుటుంబంలో ఏడుకొండలు జన్మించారు. ఇంటర్మీడియట్ వరకు ఇదే గ్రామంలో చదువుకున్న ఏడుకొండలు.. ఆ తర్వాత ఎస్వీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చదివారు. అనంతరం యూనివర్సిటీలో కో- ఆపరేటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. తర్వాత సివిల్స్ రాసి ఐఈఎస్ అధికారిగా ఎంపికయ్యారు. కొన్నాళ్ల పాటు ఇండియాలోనే పనిచేశారు.
ప్రస్తుతం అమెరికా  కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫోల్సమ్ సిటీలో స్థిరపడ్డారు. అక్కడే అవతార్ ఐటీ సొల్యూషన్ స్థాపించి సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.
ఇదిలా ఉండగా  2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రాంతీయ పార్టీ పెట్టేందుకు ఏడుకొండలు ప్రయత్నించినట్లు ఆయన మిత్రులు చెప్పారు.ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కోవూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించగా, అది కూడా ఫలించలేదని స్నేహితులు చెబుతుంటారు. తర్వాత ఏడుకొండలు అమెరికాలోనే స్థిరపడి అక్కడి రాజకీయాల్లో చక్రం తిప్పారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా ఈ ఎన్నికల్లో మాత్రం అత్యధిక మెజారిటీ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక, అమెరికా ఎన్నికల్లో తమ ఏడుకొండలు విజయం సాధించడంతో ఆయన గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: