ఎన్నికల వేళ ఈ తుపాకుల గోల ఏమిట్రా బాబూ...?

SS Marvels
ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికా దేశంలో మరో రెండు రోజుల్లో అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్పటికే ఒకవైపు ఎన్నికల ప్రచార హోరు అమెరికా అంతటా మారు మ్రోగుతుండగా మరోవైపు ప్రజలందరికీ భయం కలిగేలా ఆ దేశం అమెరికాలో తుపాకుల కొనుగోలు ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నిక‌ల వ‌ల్ల దేశంలో అశాంతి, అల‌జ‌డి చెల‌రేగే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళన వ్యక్తమవుతోంది. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆ ప్ర‌మాదాల‌ను నివారించేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. దేశంలో అనేక అంశాల‌పై విభ‌జ‌న ఉంద‌ని, ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డికి వారాల పాటు స‌మ‌యం ప‌డుతోంద‌ని, దీని వ‌ల్ల దేశంలో అశాంతి చెల‌రేగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు జుక‌ర్‌బ‌ర్గ్ అన్నారు. అయితే ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు త‌మ కంపెనీ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న చెప్పారు.
ఈ మధ్య కాలంలో గన్ కల్చర్ బాగా పెరుగుతుండటంతో ఎన్నికల వేళ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రముఖ రీటైలర్ సంస్థ వాల్‌మార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై.. తుపాకులు, తూటాలు, మందుగుండు సామాగ్రిని తమ స్టోర్స్ నుంచి తీసివేయాలని నిర్ణయించింది. వాల్‌మార్ట్ దుకాణాల్లో ఇక నుంచి తుపాకులు, తూటాలను బహిరంగంగా ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకుంది. అమెరికా వ్యాప్తంగా 4,700 రిటైల్ స్టోర్స్‌ను వాల్‌మార్ట్ నిర్వహిస్తుండగా... సగం వాటిలో తుపాకులను విక్రయిస్తోంది. ఖాతాదారుల భద్రత కోసం తుపాకులు, తూటాలను ప్రదర్శన నుంచి తరలించామని వాల్‌మార్ట్ ఈమెయిల్ సందేశంలో పేర్కొంది. వాల్‌మార్ట్ గతేడాది చేతి తుపాకులు, షార్ట్ బారెల్ రైఫిల్, మందుగుండు విక్రయాలను నిలిపివేసింది. జార్జ్ ప్లాయిడ్ ను పోలీసులు హతమార్చిన నేపథ్యంలో వాల్‌మార్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కోవిడ్-19 కారణంగా ఏర్పడిన సంక్షోభం, నగదు కొరత, జాత్యాహంకార ఘటనల నేపథ్యంలో అమెరికాలో తుపాకుల అమ్మకాలు జెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల రోజు లేదా ఫలితాలు వెల్లడయిన రోజు హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఐదు మిలియన్ల మంది తుపాకులు కొనుగోలు చేసినట్టు గణాంకాలు వెల్లడవుతున్నాయి. తొలిసారి ఇంత పెద్ద సంఖ్యలో తుపాకులు అమ్ముడుపోయాయి. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యక్తిగత తుపాకులు కలిగి ఉన్న దేశాల జాబితాలో అమెరికా తొలి స్థానంలోనూ, తర్వాత స్థానంలో యెమెన్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: