వైఎస్ జగన్ పై ఉన్న "క్విడ్ ప్రో కో" కేసు వివరాలు ఇవే...

VAMSI
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజూ ఎవరో ఒకరు జగన్ ఒక రౌడీ... నేరస్థుడు ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయి..ఎన్ని రోజులు జైలుకెళ్లాడు...అని అంటూ ఉండేవారు... ఇదంతా వింటున్న ప్రజలు మరియు ఆయన అభిమానులు నిజంగానే ఈయనపై అన్ని కేసులు ఉన్నాయా..వాస్తవాలేంటి అని తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఎదురుచూస్తుంటారు... ఇవన్నీ కేవలం ఆరోపణలేనా..? లేక తప్పిదాలా..? అన్న విషయం పక్కన పెడితే... ఏ ఏ చార్జిషీట్లలో ఏముందో ఎవరికైనా తెలుసా... ఇప్పుడు అవేంటో చూద్దాం.
ఇటీవలే సుప్రీం కోర్టు దేశంలోని అన్ని హైకోర్టులను..ప్రస్తుత, మాజీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులపై  ఎప్పటినుండో ఉన్న పెండింగ్ కేసుల వివరాలను అందించాలని, ఈ కేసులను రోజువారీ ప్రాతిపదికన విచారించి  వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశానికి  అనుగుణంగా ఆచరణ మొదలైంది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న కేసులను రోజువారీ ప్రాతిపదికన చేపట్టాలని హైకోర్టు నిర్ణయించిన తర్వాత.... వరుసగా చూస్తే జగన్‌పై సీబీఐ నమోదు చేసిన 11 కేసుల గురించి తెలిసిందే... కాగా హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో మంగళవారం వీటిపై విచారణ చేపట్టింది.
2010 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ క్విడ్ ప్రో కో పేరుతో కొన్ని సంస్థలకు మైనింగ్ లైసెన్సులు, భూములు మరియు ఇతర అవకాశాలు ఇచ్చి తన సంస్థ యినా జగతి లో పెట్టుబడులు పెట్టించుకున్నారు అనే విషయంపై  అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శంకర్ రావు మరియు దివంగత మాజీ ఎంపీ ఎర్రంనాయడు హై కోర్ట్ లో వేసిన పిటీషన్లతో ఈ కేసులు నమోదు చేసారు. దీనిపై హైకోర్టు 2011 ఆగస్టు 10న సీబీఐ విచారణకు ఆదేశించింది. హై కోర్ట్ ఆదేశంతో సిబిఐ వారు తప్పు జరిగిందని నమ్మి 2011  ఆగష్టు 17 న  ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసారు.  
ఈ విషయంపై సిబిఐ పెట్టిన కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నేరపూరిత కుట్ర, మోసం, నేరపూరిత నమ్మక ద్రోహం, లెక్కలు తారుమారు చేయడం, క్రిమినల్ మిస్ కాండక్ట్‌తో పాటు అవినీతి నివారణ చట్టాల కింద కేసులను  నమోదు చేసింది. ఈ కేసులో మొత్తం 71 మందిని నిందితులుగా జతచేసింది. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు వై ఎస్ విజయ సాయి రెడ్డి ముఖ్య నిందితులుగా ఉండడం గమనార్హం.  అయితే మొత్తంగా ఈ కేసులపై 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేయగా...దీనిని ఆధారంగా చేసుకుని ఈడి 5 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. అయితే వీటిపై విచారణలు కొనసాగుతున్నాయని జగన్ తరపున న్యాయవాది జి. అశోక్ రెడ్డి తెలిపారు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: