లేఖపై ఒత్తిడి పెంచుతున్న జగన్.. మరోమారు ఢిల్లీ పర్యటన

B.Karthik

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీల అపాయిట్మెంట్‌ను జగన్ కోరారు. అయితే అపాయిట్మెంట్ ఖరారైందని ఇంకా పీఎంవో ఆఫీసు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. వారం రోజుల్లో రెండోసారి ప్రధాని అపాయిట్మెంట్‌ను సీఎం జగన్ కోరడంపై రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు జగన్ ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు..? వారం రోజుల్లోనే ఢిల్లీ వెళ్లడం వెనుక ఆంతర్యమేంటి..? రాష్ట్రపతి, ప్రధానిని ఎందుకు కలవాలనుకుంటున్నారు..? ఆ ఇద్దర్నీ కలిసి జగన్ ఏం చర్చించబోతున్నారు..? అనేదానిపై తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ రావాలని కేంద్ర పెద్దల నుంచి ఫోన్ వచ్చిందా..? లేకుంటే జగనే ఢిల్లీ వెళ్తున్నారా..? అనేదానిపై కూడా ఎలాంటి స్పష్టత లేదు. అయితే.. ఈ భేటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిణామాలు, రాజకీయ విషయాలపై ప్రధాని, రాష్ట్రపతితో జగన్ చర్చించనున్నారని సమాచారం. ముఖ్యంగా సుప్రీంకోర్టు సీజేకు ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై ప్రధాని, రాష్ట్రపతితో ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.
అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల విషయమై ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ చర్చిస్తారని తెలుస్తోంది. కాగా.. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. దేశ చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఓ సుప్రీంకోర్టు జడ్జికి వ్యతిరేకంగా పోరు ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఇక వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యవహారంపై సుప్రీం ఛీఫ్‌ జస్టిస్‌ బాబ్డేకు లేఖ రాసిన జగన్‌.. తుదపరి చర్యల కోసం ఒత్తిడి పెంచేందుకు సిద్ధమయ్యారు. మరోసారి ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి కోవింద్‌కు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్రంలోని పెద్దలను, ఇతర పార్టీల నేతలను కలిసి రమణ అభిశంసన కోసం ఒప్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఓ సుప్రీంకోర్టు జడ్జికి వ్యతిరేకంగా అభిశంసన కోసం దేశంలో జరుగుతున్న అతిపెద్ద రాజకీయ ప్రయత్నంగా ఇది మిగిలిపోనుంది. ఇందులో ఎలాగైనా సఫలం కావాలని జగన్‌ పావులు కదుపుతుండగా.. అడ్డుకునేందుకు అంతకుమించిన ప్రయత్నాలే సాగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: