తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కొత్త సమస్య.. ఎంతవరకు దారితీస్తుందో..?

NAGARJUNA NAKKA
తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో ఆర్టిజన్లుగా పనిచేస్తున్న 23వేల మందికి కొత్త సమస్య వచ్చి పడింది. ఇన్నాళ్లు తనను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని ఉద్యమించిన విద్యుత్ ఉద్యోగులకు స్టాండింగ్ ఆర్డర్స్ ను అమలు చేయాలని యాజమాన్యం భావిస్తోంది. అయితే దీనికి ఒప్పుకోమని.. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు నిబంధనలే తమకు వర్తింప చేయాలని లేదంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు విద్యుత్ ఉద్యోగులు. 


తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్టు పద్దతిలో పని చేసిన 23వేల మంది కార్మికులను ప్రభుత్వం గత ఏడాది   క్రమబద్ధీకరించింది. ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నవారికి ఐదేళ్లకోసారి పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది. ఓ గ్రేడ్‌లో కనీసం ఐదేళ్ల సర్వీసు ఉంటే దానికి పైన ఉండే గ్రేడ్‌కు పదోన్నతి కల్పిస్తామని చెప్పింది. గ్రేడ్‌ 4 ఆర్టిజన్‌గా ఐదేళ్ల సర్వీసు ఉన్న వారికి గ్రేడ్‌ 3 ఆర్టిజన్లుగా పదోన్నతి కల్పించనున్నారు. అలాగే మిగిలిన గ్రేడ్ లలో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతి ఇవ్వనున్నారు. గ్రేడ్‌ మారితే ఆర్టిజన్ల వేతనాలు సైతం పెరగనున్నాయి. ప్రస్తుతం ఆర్టిజన్లకు ఏక మొత్తం వేతనాన్ని మాత్రమే చెల్లిస్తుండగా, ఇకపై వారికి సైతం రెగ్యులర్‌ ఉద్యోగుల తరహాలో టీఏ, ఇంక్రిమెంట్లు, బోనస్, ఎక్స్‌గ్రేషియా, సెలవులు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, ఇతర ప్రయోజనాలు వర్తింపజేయాలని రెగ్యులరైజ్ చేసిన సమయంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు స్టాండింగ్ ఆర్డర్స్ ను వర్తింపు చేయాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. ఆ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 


తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, టిఎస్‌.ఎస్.పి.డి.సి.ఎల్ సంస్థ ల్లో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న 23 వేల మంది కార్మికులు, ఉద్యోగులను ఆయా విద్యుత్‌ సంస్థలు 2018, సెప్టెంబర్‌లో ఆర్టిజన్లుగా విలీనం చేసుకున్నారు. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్లను 4 గ్రేడ్లుగా విభజించారు. తాజాగా ఆర్టిజన్ల కోసం విద్యు త్‌ సంస్థల యాజమాన్యాలు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ పేరుతో ముసాయిదా సర్వీస్‌ రూల్స్‌ను రూపొందించి రాష్ట్ర కార్మిక శాఖ ఆమోదం కోసం పంపించాయి. బదిలీల విషయం మినహాయిస్తే మిగిలిన అన్ని అంశాల్లో 4 విద్యుత్‌ సంస్థలు ప్రతిపాదించిన సర్వీసు రూల్స్‌ ఒకేలా ఉన్నాయి.ఈ ముసాయిదా సర్వీసు నిబంధనలపై ఆ శాఖ ప్రస్తుతం కార్మిక సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహిస్తోంది. కార్మిక శాఖ ఆమోదిస్తే ఈ సర్వీసు రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. ఆర్టిజన్ల కోసం ప్రత్యేక సర్వీస్‌ రూల్స్‌ రూపొందించడం తెలంగాణ విద్యుత్ శాఖలో ఇదే తొలిసారి.


విద్యుత్‌ సంస్థల్లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టిజన్లు ఒకే చోట పనిచేస్తున్నారు. కొత్త సర్వీస్‌ రూల్స్‌ అమల్లోకి వస్తే విద్యుత్‌ సంస్థల అవసరాల మేరకు వీరికి బదిలీలు నిర్వహించనున్నారు. ఒక చోటు నుంచి మరో చోటికి సమాన పోస్టుకు బదిలీ చేయనున్నారు. వీరికి బదిలీ చేసే అధికారం ఎవరికి ఉండాలన్న విషయంలో మాత్రం విద్యుత్‌ సంస్థలు వేర్వేరు నిబంధనలు రూపొందించాయి. ఆర్టిజన్ల సీనియారిటీ, సెలవుల మంజూరు తదితర అంశాలను ఈ సర్వీసు రూల్స్‌లో చేర్చారు. ఈఎస్‌ఐ సదుపాయం లేని ఆర్టిజన్లకు విద్యుత్‌ సంస్థలు వైద్య సదుపాయం కల్పించనున్నాయి. ఇందుకోసం కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసి, ఆర్టిజన్ల వేతనం నుంచి ప్రతి నెలా 500 రికవరీ చేయనున్నాయి. ప్రతి ఆర్టిజన్‌కు ఏటా 6 లక్షల లోపు కుటుంబ వైద్య సదుపాయాన్ని కల్పించనున్నాయి. ఆర్టిజన్‌తో పాటు జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు వైద్య సదుపాయానికి అర్హులు. 25 ఏళ్ల లోపు వయస్సు వరకు కొడుకు, పెళ్లి,ఉద్యోగం పొందే వరకు కూతురు వైద్య సేవలకు అర్హులుగా ఉంటారని విద్యుత్ సంస్థలు నిబంధనలను రూపొందించాయి.  


అయితే విద్యుత్ సంస్థలు తీసుకువచ్చిన స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం 15 రోజుల పాటు ఉద్యోగి ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు అయితే ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. హెచ్ఆర్ఏ అవకాశం లేదు. పదవీ విరమణ తరువాత గ్రాట్యుటీ ఏమి ఉండదు, ప్రైవేటు ఉద్యోగుల మాదిరిగా వెరబుల్ డీఏ ఇస్తామని విద్యుత్ సంస్థలు ప్రకటించాయి. ఆర్టిజన్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేయడంలో కూడా వివక్ష చూపారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కాంట్రాక్టు పద్దతిలో పని చేసిన వారిని చదువులేదని గ్రేడ్ 4లో కేటాయించడం అన్యాయమని వాపోతున్నారు. ఆర్టిజన్ లకు డిగ్రీ మాత్రమే అర్హత ఉంటే,  సుమారు 3 వేల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారిని వివిధ ఫైరవీల ద్వారా ఉద్యోగాల్లో తీసుకుని వారికి గ్రేడ్ 1 స్థాయి కల్పించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిజన్ కార్మికులు ఉద్యమిస్తే వారిని శాంతింప చేయడానికి కంటితుడుపుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే ఇతర సదుపాయాలు కల్పించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని   ఆరోపిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: