రాజానగరం రారాజు ఎవ‌రో.... జ‌క్కంపూడి వార‌సుడి స‌త్తా ఎంత‌...!

VUYYURU SUBHASH
గత రెండు ఎన్నికలకీ భిన్నంగా ఈసారి రాజానగరం ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా 2009, 14 ఎన్నికల్లో తెదేపా నుంచి విజయం సాధిస్తున్న పెందుర్తి వెంకటేష్...మరోసారి పోటీకి దిగారు. అయితే గతంలో మాదిరిగా ఈసారి పెందుర్తి విజయం అంత సులువు కాదనే చెప్పాలి. ఈయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలే ఓటమి వైపు పయనించేలా చేస్తున్నాయి. అభివృద్ధి పనుల్లో కమీషన్లు దండుకున్నారని, ఔట్‌ సోర్సింగ్‌ అంగన్‌వాడీ పోస్టులను సొమ్ములకు అమ్ముకున్నారని, ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యే పాత్ర ఉందని.. కోరుకొండ లక్ష్మినరసింహస్వామి కొండను సైతం తవ్వేసి మట్టిని తరలించుకుపోయారని.. కాపు కార్పొరేషన్‌ లోన్లు ఇప్పిస్తామని సుమారు 2 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని చాలా రకాల ఆరోపణలు పెందుర్తి మీద వచ్చాయి. 


ఒకానొక సమయంలో సొంత పార్టీ నేతలే ఈయన అవినీతి గురించి చంద్రబాబుకి ఫిర్యాదు చేశారనే వార్తలు కూడా వచ్చాయి. ఇవే ఇప్పుడు పెందుర్తి విజయానికి అడ్డుగా ఉన్నాయి. వీటిని పక్కనబెడితే పెందుర్తి గత ఐదేళ్లలో అభివృద్ధి బాగానే చేశారు. అలాగే ఇక్కడ తెదేపా క్యాడర్ బలం ఉండటం..సంక్షేమ పథకాలు పెందుర్తికి ప్లస్ అవుతాయి. ఇక వైసీపీ తరపున జక్కంపూడి కుటుంబ సభ్యుడు  రాజా బరిలో ఉన్నారు. కేవలం ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతే రాజాకి ప్లస్. అవి కాకుండా నాయకుల పరంగా చూస్తే వెంకటేష్ కంటే రాజా బలమైన నేత కాదు. కాకపోతే ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలని ప్రజల్లోకి తీసుకెళ్లారు. జగన్ పాదయాత్ర, జక్కంపూడి కుటుంబానికి ఉన్న పేరు రాజానీ గెలుపు తీరాల వైపు తీసుకెళ్ళోచ్చు.


కానీ కాపు ఓట్లు ఎక్కువ ఉన్న రాజానగరంలో జనసేన అభ్యర్ధి రాయపురెడ్డి ప్రసాద్ పోటీలో ఉండటం...వైకాపాకి నష్టం చేయొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని ఈ రెండు పార్టీలు షేర్ చేసుకుంటే చివరకి తెదేపాకి లాభం కలగొచ్చు. అయితే జనసేన కేవలం పవన్ ఇమేజ్, కాపుల ఓట్లు మీదే ఆధారపడాల్సి రావడం మైనస్. ఇక ఈ నియోజకవర్గంలో రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాలు ఉన్నాయి. ఇక ఇక్కడ కాపు, బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు నిర్ణయించే నిర్ణయాత్మక శక్తి కాపు ఓటర్లదే. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ వైకాపాకి కొంత సానుకూల వాతావరణం కనపడుతుంది. కానీ జనసేన ప్రభావం వలన ఏ పార్టీకి నష్టం కలుగుతుందో ఎన్నికల్లో తెలుస్తోంది. మరి చూడాలి ఈసారి రాజానగరంలో రాజ్యాధికారాన్ని ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: