తెలంగాణాలో కర్ణాటక తరహా కాంగ్రెస్ వ్యూహం? డికె శివకుమార్ రంగ ప్రవేశం? ఇక రేపు హార్స్ ట్రేడింగేనా?

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కు అతి స్వలప వ్యవధి మాత్రమే మాత్రమే ఉండటంతో తమ పార్టీ తిరుగు బాటు అభ్యర్థులను దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్‌ వేగంగా పావులు కదుపు తోంది. కర్ణాటక తరహా వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు.  దీనికోసం కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి డీకే శివకుమార్‌ను ఆ పార్టీ అధిష్ఠానం రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడింది. అత్యధిక స్థానాలు కలిగిన పెద్ద పార్టీగా భాజపా నిలిచింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ మాత్రం రాలేదు. 


ఎన్నికల ఫలితాలను బట్టి కర్ణాటక తరహా ఫార్మూలాను అనుసరించాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక చేస్తోంది. ప్రజాకూటమికి  ఏక పక్షంగా ప్రజలు తీర్పిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిపై పార్టీ దృష్టి కేంద్రీకరించనుంది. ఒకవేళ ఏ పార్టీకి కూడ పూర్తిస్థాయిలో మెజారిటీ రాకపోతే టీఆర్ఎస్‌‌ అధికారంలోకి రాకుండా అనుసరించాల్సిన వ్యూహం  పై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వ్యూహన్ని సిద్దం చేస్తున్నారు. గులాం నబీ ఆజాద్‌ తో సహా ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ‌తదితరులు హైద్రాబాద్‌కు రానున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులపై కూడ కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోంది.



జేడీఎస్‌, కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. అయితే గవర్నర్ మాత్రం‌ రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం భాజపా నేత యడ్యూరప్ప ను ముఖ్యమంత్రిగా నియమించారు. విశ్వాస పరీక్ష సందర్భంగా కాంగ్రెస్‌, జేడీఎస్‌ శాసనసభ్యులు భాజపా వైపునకు వెళ్లకుండా కట్టడి చేయడంలో డీకే శివకుమార్‌ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో ఆయన పేరు కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టిలో పడింది. ట్రబుల్‌ షూటర్‌ గా పేరు తెచ్చుకున్న డీకే శివకుమార్‌ తెలంగాణలో రంగం లోకి దింపడంతో రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. ఒక వేళ హంగ్‌ ఏర్పడితే డీకే శివకుమార్‌ ఎలాంటి వ్యూహం అనుసరించనున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికల ఫలితాల వెల్లడికి తక్కువ సమయమే మిగిలి ఉండటంతో రేపు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఏఐసీసీ పెద్దలు సైతం ఈ సాయంత్రానికే హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ఇప్పటికే టీఆరెస్ కు మజ్లిస్‌ పార్టీ మద్దతు ప్రకటించడం, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎంఐఎం‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ భేటీ కావడంతో కాంగ్రెస్‌ వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. 


ఏ పార్టీకీ మెజార్టీ దక్కకుండా హంగ్‌ ఏర్పడితే స్వతంత్ర అభ్యర్థుల సాయం తో గట్టెక్కాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులతో ఆ పార్టీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌-పోల్‌ సర్వేలు తెరాసకు అనుకూలంగా ఉండగా, ఆంధ్ర ఆక్టోపాస్ అని పేరున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ బృందం చేసిన సర్వేలో మాత్రం ప్రజాకూటమికి విజయావకాశాలు ఉన్నట్లు తేలిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేపు వెల్లడయ్యే ఫలితాలపై న్రడే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ‌

ఇదిలా ఉంటే ప్రజా కూటమిని ఒకే పార్టీగా గుర్తించాలని రాష్ట్ర గవర్నర్‌ ఈ ఎస్ ఎల్ నరసింహన్ ను కోరినట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నేడు (సోమవారం) రాజ్‌భవన్‌ లో గవర్నర్ ‌నరసింహాన్‌ తో సమావేశమైన తర్వాత ప్రజా కూటమి నేతలు మీడియా తో మాట్లాడారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు , ఎమ్మార్పీఎస్, తెలంగాణ ఇంటి పార్టీలు - పోటీ చేసిన విషయాన్ని డాక్యుమెంట్ సహా గవర్నర్‌కు సమర్పించినట్టు చెప్పారు. 

ఎన్నికల కమిషన్‌ కు సమర్పించిన డాక్యుమెంట్లను కూడ గవర్నర్ కు అందించినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అతి పెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి పిలవ వలసిన పరిస్థితి వస్తే ప్రజాకూటమిని ఒకే పార్టీగా గుర్తించాలని ముందస్తు గానే తాము గవర్నర్‌ను కలిసినట్టు రెడ్డి చెప్పారు. ప్రజా కూటమికి సంపూర్ణ మెజారిటీ వస్తోందని టీజేఎస్ కన్వీనర్ ప్రొ. కోదండరామ్ చెప్పారు. సర్కారియా కమిషన్  సిఫారసుల ఆధారంగా కూటమిని ఒకే పార్టీగా చూడాల్సిన అవసరం ఉందని ప్రొ. కోదండ రామ్ చెప్పారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకొని  ఎన్నికల్లో అక్రమాలకు టీఆర్ఎస్ పాల్పడిందని  టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ చెప్పారు.  2014 ఎన్నికల్లో రాష్ట్రపతి పాలన సమయంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలు పీపుల్స్ ఫ్రంట్‌ - ప్రజా కూటమిని ఆదరించినట్టుగా ఆయన తెలిపారు.


హేమాహెమీలు  డికె శివ కుమార్, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ వంటి వారు నగరంలోనే ఉండి ఒక వేళ ప్రజా కూటమికి మెజారిటీ వస్తే ప్రభుత్వ ఏర్పాటును పూర్తయ్యేవరకు తమ పార్టీ సభ్యులు చేజారకుండా చూసేపనిలో కాంపుల వంటివి నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: