ఎడిటోరియల్ : జగన్ పై హత్యాయత్నమంటే అంత వెటకారమా ?

Vijaya

జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి సంబంధించి  చంద్రబాబునాయుడు అండ్ కో స్పందించిన విధానంపై ఎంతమంది గడ్డిపెట్టినా ఇంకా బుద్ది వచ్చినట్లు లేదు. తెలుగుదేశంపార్టీకి ఇంకా బుద్ది రాలేదనటానికి తాజాగా ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించిన విధానమే నిదర్శనం. జగన్ పై హత్యాయత్నానికి సంబంధించి ఆది మాట్లాడుతూ, జగన్ పై దాడి అంతా వాళ్ళ క్రియేషనే అంటూ ఎగతాళిగా మాట్లాడారు. ఎయిర్ పోర్టులో దాడి మొదటి క్రియేషనట. ఆసుపత్రిలో చేరటం రెండో క్రియేషన్ అయితే, సర్జికల్ బ్యాగ్ కట్టుకోవటం మూడో క్రియేషన్ అంటూ ఎద్దేవా చేశారు.

 

జగన్ పై జరిగిన దాడి కందిరీగల దాడికన్నా చిన్నదన్నారు. కందిరీగ కుట్టినా కత్తితో పొడిపించుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ రక్తమే వస్తుందన్న ఆది మాటల్లో బాగా వెటకారమే కనిపిస్తోంది. ఒకేసారి జగన్ బాహుబలి 1, 2, 3 సినిమాలు జనాలకు చూపించేశారట. జగన్ చెప్పుకుంటన్నట్లు నిజంగానే గాయం అంతపెద్దదైతే విశాఖపట్నంలోనే కట్టుకట్టించుకోకుండా హైదరాబాద్ కు వచ్చి ఆసుపత్రిలో చేరటం ఏంటంటూ పెద్ద లా పాయింట్ లేవదీశారు.

 

దాడి ఘటనపై సిట్ చాలా లోతుగా విచారణ చేస్తోందట. అందుకనే ఎక్కువ సమయం పడుతోందని ఫిరాయింపు మంత్రి తాపీగా చెప్పారు. కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు గనుక సరైన నివేదిక ఇవ్వకపోతే ఉద్యోగాలకే భద్రత ఉండదంటూ ఎగతాళి చేయటం విడ్డూరంగా ఉంది. నిందితుడు రూ 20 లక్షలు పెట్టి ఇల్లు కడుతుండటం, ఏడు సెల్ ఫోన్లు మార్చటంపై అధికారులు కేసును బాగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారట. నిందితుడు రూ 20 లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నారని చెప్పిన ఫిరాయింపు మంత్రి ప్రభుత్వమే రెండిళ్ళను మంజూరు చేసిందని మాత్రం చెప్పకుండా దాచిపెట్టటం గమనార్హం. 

 

ఎయిర్ పోర్టు క్యాంటిన్లో పనిచేస్తున్న నిందితుడు రూ 20 లక్షలు పెట్టి ఇల్లు ఎలా కట్టగలడు ? అన్న ప్రశ్నకు మాత్రం ఆది సమాధానం ఇవ్వలేదు.  నిందితుడికి రెండు ఇళ్ళను ప్రభుత్వమే మంజూరు చేసిందని ఒప్పుకుంటే టిడిపి మద్దతుదారుడు కాబట్టే రెండు ఇళ్ళు మంజూరయ్యాయని అంగీకరించాల్సొస్తుందన్న భయం ఆదిలో కనబడింది. నిందితుడు టిడిపి మద్దతుదారుడే అని ఫిరాయింపు మంత్రి ఒప్పుకుంటే అప్పుడు అసలు సినిమా మొదలవుతుంది. అందుకనే ఆ విషయాన్ని మాత్రం టిడిపి నేతలు అంగీకరించటం లేదు.

 

జగన్ పై జరిగిన హత్యాయత్నాన్ని డ్రామాగా మొదటిరోజే చంద్రబాబు కొట్టిపారేశారు. దాంతో అదే పెద్ద వివాదమైంది. దానికితోడు కెసియార్, కెటియార్, కవిత, బిజెపి రాజ్యసభ సభ్యుడు జవిఎల్ నరసింహారావుతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వామపక్షాల కార్యదర్శులు, కేంద్రమంత్రులు తదిదతరులంతా పరామర్శించటంతో చంద్రబాబుకు ఒళ్ళు మండిపోయింది. దాంతో అప్పటి నుండి జగన్ పై దాడిని మంత్రులు, నేతలంతా వరుసబెట్టి ఎగతాళి చేస్తునే ఉన్నారు. హత్యాయత్నంపై చంద్రబాబు కామెంట్ చేసిన విధానంపై ప్రతిపక్షాలు, బిజెపి నేతలు, వామపక్షాల నేతలందరూ దుమ్మెత్తిపోశారు. అయినా చంద్రబాబు అండ్ కో లో ఏమాత్రం మార్పు రాలేదు. చూడబోతే అభద్రతతోనే జగన్ హత్యాయత్నంపై టిడిపి ఎదురుదాడి చేస్తున్నట్లు కనబడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: