ఎడిటోరియల్ : చంద్రబాబు పెద్ద సాహసమే చేయబోతున్నారు

Vijaya

తెలంగాణా ముందస్తు ఎన్నికల సందర్భంగా  చంద్రబాబునాయుడు పెద్ద సాహసం చేయబోతున్నారా ? పార్టీ నేతలు అవుననే అంటున్నారు. ఇంతకీ ఆ సాహసం ఏమిటనుకుంటున్నారా ? ముందస్తు ఎన్నికల్లో తెలంగాణాలో తాను ప్రచారం చేస్తానని చంద్రబాబు తమ్ముళ్ళకు హామీ ఇచ్చారు. తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేయటమంటే చాలా పెద్ద సాహసం క్రిందే లెక్క. ఏపికి ముఖ్యమంత్రే అయినా, తెలుగుదేశంపార్టీకి జాతీయ అధ్యక్షుడైనా చంద్రబాబు తెలంగాణా వ్యవహారాలను పూర్తిగా గాలికొదిలేసిన విషయం తెలిసిందే.

 

తెలంగాణా రాజకీయాలపై గట్టిగా మాట్లాడలేని స్ధితిలో పడిపోయారు చంద్రబాబు. కారణం ఏమిటంటే  మూడున్నరేళ్ళ క్రితం బయటపడిన ఓటుకునోటు కేసే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ కేసులో తగులుకునే పదేళ్ళ ఉమ్మడి రాజధాని అయినప్పటికి హైదరాబాద్ ను అర్ధాంతరంగా వదిలేసుకుని విజయవాడకు పారిపోయారు. అప్పటి నుండి తెలంగాణా రాజకీయాలను ప్రత్యేకించి కెసియార్ గురించి లేదా తెలంగాణా ప్రభుత్వం గురించి నోరెత్తటానికే చంద్రబాబు భయపడిపోతున్నారు.


ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకవైపు చంద్రబాబును కెసియార్ అమ్మనాబూతులు తిడుతున్నారు. ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ అని కెసియార్ పదే పదే బహిరంగసభల్లో అంటున్నా గట్టిగా బదులు కూడా ఇవ్వలేకపోతున్నారంటే చంద్రబాబు పరిస్ధితేంటో అర్ధమైపోతోంది. అటువంటిది తెలంగాణా ఎన్నికల్లో ప్రచారానికి చంద్రబాబు వస్తారంటేనే నమ్మకం కుదరటం లేదు.


ఎందుకంటే,  ఎన్నికల ప్రచారానికి రావటమంటే కెసియార్ ను టార్గెట్ చేయాల్సిందే. మరి తనను టార్గెట్ చేస్తే కెసియార్ ఎందుకూరుకుంటారు? ఓటుకునోటు కేసు విచారణను వేగవంతం చేయరా ? అదే జరిగితే అపుడు చంద్రబాబు పరిస్దితేంటి ? నిజంగా తెలంగాణా టిడిపిలో ఉన్న నేతలే కొద్దిమంది. వారిలో కూడా గట్టి నేతలు ఎంతమందంటే టార్చిలైట్ వేసినా కనబడరు. మరి అటువంటి నేతలు ప్రచారం చేస్తే జనాలు ఎందుకు పట్టించుకుంటారు .

 

ఆ విషయాలు వారికి బాగా తెలుసు కాబట్టే చంద్రబాబును ప్రచారానికి రావలంటూ పదే పదే పట్టుపడుతున్నారు. వాళ్ళ ఒత్తిడికి లొంగి తాను తెలంగాణాలో ప్రచారానికి వస్తే జరగబోయేదేమిటో చంద్రబాబుకే బాగా తెలుసు. అందుకనే ఇంతకాలం తెలంగాణా వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఇక ఇపుడు ఎన్నికల సమయంలో కూడా దూరంగా ఉంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. అందుకనే ప్రచారానికి ఒప్పుకున్నట్లున్నారు. నిజంగానే చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వచ్చి కెసియార్ ను టార్గెట్ చేస్తే మాత్రం ముందస్తు ఎన్నికల వేడి, రాజకీయ మార్పులు ఏం రేంజిలో ఉంటయో ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: