బాబు స్థానంలో నిన్న బాలయ్య.. నేడు భువనేశ్వరి...!?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన వార్తలు ఇటీవల భలే ఆసక్తి రేపుతున్నాయి. నిన్నటివరకూ చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండటం వల్ల ఆయన స్థానాన్ని ఆయన కుటుంబసభ్యులు భర్తీ చేసిన విధానం ఆసక్తిరేపుతోంది. లేపాక్షి ఉత్సవాలకు సంబంధించిన సమీక్ష నిర్వహించిన సమయంలో చంద్రబాబు కుర్చీలో బాలకృష్ణ కూర్చోవడం కలకలం రేపింది. ఆ సమయంలో మంత్రులు పక్కనే ఉన్నా వారించకపోవడం విశేషం. 

బాలయ్య సీఎం సీట్లో కూర్చోవడంపై విపక్షాలు విమర్శలు సంధించాయి. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని నటుడు, హిందుపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ మోజు తీర్చుకున్నారని ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. తన తండ్రి ఎన్టీఆర్‌ కుర్చీని చంద్రబాబు లాక్కున్నారని బాలకృష్ణ మనస్సులో ఉండి ఉండొచ్చు.. అందుకే సీఎం రాష్ట్రంలో లేనప్పుడు ఆ కుర్చీలో కూర్చున్నాడని సెటైర్ వేశారు. సీఎం సీట్లో కూర్చుని బాలకృష్ణ మోజు తీర్చుకున్నాడని కామెంట్ చేశారు. 


వైసీపీ నేతలు కూడా బాలయ్య తీరుపై విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా సీఎం అధికారిక నివాసంలో ఆయన భార్య నారా భువనేశ్వరి జెండా ఎగరేశారు. ఇందులో నిబంధనల అతిక్రమణ ఏమీ లేకున్నా.. చంద్రబాబు ఎగరేయాల్సిన జెండాను ఆయన అందుబాటులో లేకపోవడంతో భువనేశ్వరి ఎగరేశారు. చంద్రబాబు రావాల్సిన విమానం ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.


డావోస్ లో సమ్మిట్ కు వెళ్లిన చంద్రబాబు శుక్రవారం ఉదయానికి విజయవాడ చేరుకోవలసి ఉంది. దీనికోసమే గవర్నర్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ కార్యక్రమం తర్వాత ఏర్పాటు చేశారు. కానీ.. పొగమంచు, వాతావరణ ఇబ్బందుల కారణంగా చంద్రబాబు విమానం అమరావతికి రావడం ఆలస్యమైంది. ఆయన సమయానికి రాలేరని నిర్థారించుకున్న తర్వాత ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: