జాతీయ, అంతర్జాతీయ న్యూస్ రౌండప్ : ఏప్రిల్,19

Edari Rama Krishna

అద్వానిని రాష్ట్రపతి కాకుండా మోదీ కుట్ర: లాలూ


బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కుట్ర పన్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఆరోపించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్.కే. అద్వానీ సహా మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలకు వ్యతిరేకంగా బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు.


జయలలిత బంగ్లాలో అగ్ని ప్రమాదం


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటి దగ్గర అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి హానీ జరగలేదని స్థానిక పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటని అధికారులు ఆరా తీస్తున్నారు. కాంచీపురం జిల్లాలోని సిరుదావూరు బంగ్లాను జయలలిత గెస్ట్‌హౌస్‌గా ఉపయోగించుకునే వారు. ప్రస్తుతం ఆ బంగ్లా శశికళ, దినకరన్ కుటుంబీకుల అధీనంలో ఉంది. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడంతో దినకరన్ కుటుంబ సభ్యులు అందులో ఉంటూ బంగ్లాను చూసుకుంటున్నారని సమాచారం. కాగా, శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి తప్పించాలని అన్నాడీఎంకే నిర్ణయించిన నేపథ్యంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.


పాకిస్థాన్ జిందాబాద్ అన్నారు..అయినా కూడా మౌనంగా ఉన్నాం..!

ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో అక్కడి యువత జవాన్లపై రాళ్లతో దాడి చేసిన వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జవాన్లు సైతం ఆ దాడిని మౌనంగా భరిస్తు అవేశానికి లోనవ్వకుండా విధులను నిర్వర్తించారు. విక్కీ విశ్వకర్మ అనే జవాను ఈ సంఘటనపై స్పందించారు.అక్కడి వారు పాకిస్థాన్ జిందాబాద్, గో ఇండియా గో బ్యాక్ అంటూ నినాదాలు చూస్తూ రెచ్చగొడుతున్నారు. అయినా సరే ఆవేశానికి గురికాలేదు.. నిగ్రహంతో ఉన్నానని తెలిపారు. ఆ ప్రదేశం చాలా సున్నితమైనదని, దేశ క్షేమం కోసం ఆ సమయంలో స్పందించలేదని తెలిపారు. తమ విధులను తాము సక్రమంగా నిర్వర్తిస్తూ.. మమ్మల్ని మేము రక్షించుకుంటూ దేశ ప్రయోజనాలు ఎలా కాపాడాలో శిక్షణలో నేర్పించారని, కాబట్టే మేము మౌనంగా, సమన్వయంతో ఉన్నామని చెప్పారు. 


పన్నీరుసెల్వం కొత్త డిమాండ్ 


అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిసిపోయే అంశంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. శశికళను, దినకరన్‌ను, ఆమె కుటుంబాన్ని పార్టీ నుంచి తప్పిస్తే కలిసేందుకు తాము సిద్ధమని మాజీ సీఎం పన్నీరుసెల్వం ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గానికి తేల్చి చెప్పారు. పన్నీరుసెల్వంను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయడం, ఆయనకు ఆర్థిక శాఖను ఇవ్వడం, శశికళ-దినకరన్‌లను పార్టీ నుంచి తప్పించాలనే ప్రధాన డిమాండ్లతో మంగళవారం పన్నీరువర్గం చేతులు కలిపేందుకు ముందుకు వచ్చింది.  శశికళ జైలులో ఉండటం, దినకరన్ కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో అన్నాడీఎంకేలోని శశికళ వర్గంలో కుదుపు మొదలైంది. దీంతో పన్నీరు వర్గంతో కలిసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పళనిస్వామి.. పన్నీరు షరతులకు అంగీకరించి మెట్టు దిగారు.  


ఆర్మీ హెలికాప్టర్ కూలి సైనికులు మృతి


సౌదీ సంయుక్త దళాలకు చెందిన ఆర్మీ హెలికాప్టర్ మంగళవారం యెమెన్‌లో కూలిపోయింది. ఈ ఘటనలో 12 మంది సైనికులు మృతి చెందారు. ఇందులో నలుగురు అధికారులు ఉన్నట్లు సౌదీ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా 2015 నుంచి రెబల్స్‌పై సౌదీ నేతృత్వంలోని సంయుక్త దళాలు దాడులు చేస్తున్నాయి. 

చైనా మరోసారి తెగించింది..?


చైనా మరోసారి​ కవ్వింపు చర్యలకు దిగింది. ఇండియాలోని ప్రాంతాలకు పేర్లు ప్రమాణీకరించి దుస్సాహసానికి ఒడిగట్టింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని ఆరు పట్టణాలకు అధికారికంగా తమ పేర్లు పెట్టి భారత్‌ తో కయ్యానికి కాలు దువ్వింది.టిబెట్ బౌద్ద మత గురువు దలైలామా అరుణాచల్ లో పర్యటించడాన్ని నిరసిస్తూ భారత విదేశీ వ్యవహారాల అధికారికి సమన్లు పంపించిన 9రోజుల తర్వాత చైనా ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. దక్షిణ టిబెట్ లో భౌగోళిక సార్వభౌమత్వాన్ని పునరుద్ఘాటించేలా అరుణాచల్ ప్రదేశ్ లోని 6 ప్రాంతాలకు కొత్త పేర్లు ప్రామాణికరించినట్లుగా చైనీయులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: