జాతీయ, అంతర్జాతీయ న్యూస్ రౌండప్ : జనవరి, 30

Edari Rama Krishna

ఆశారాం బాబాకు సుప్రీంకోర్టు షాక్ :

లైంగిక వేధింపుల కేసులో ఆశారాం బాపుకు సుప్రీం కోర్టు ఏడోసారి బెయిల్‌ను నిరాకరించింది. 16ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆశారాం 2013 ఆగస్టు నుంచి జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేయాలని ఆశారాం కోర్టును విన్నవించుకున్నారు. రెండు రేప్ కేసుల్లో ఆయనకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. పైగా బెయిల్ పొందడానికి ఆరోగ్యానికి సంబంధించిన నకిలీ ధృవ పత్రాలు సమర్పించాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు ఆయనకు రూ.లక్ష జరిమానా విధించింది. ఆశారాంపై కొత్తగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించింది.


బడ్జెట్ సమావేశాలకు తృణముల్ దూరం :


పార్లమెంట్‌ భవనంలోని లైబ్రరీ హాలులో ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనుండడంతో సభలో చర్చించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌ నాథ్‌,  అనంత్ కుమార్‌, జైట్లీ, అబ్బాస్‌ నఖ్వీతో పాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు.  మరోవైపు కేంద్ర బడ్జెట్‌కు దూరంగా ఉండాలని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించింది. రేపట్నుంచి ప్రారంభం కాబోయే బడ్జెట్ సమావేశాలకు.. తొలి రెండు రోజులు హాజరు కావొద్దని టీఎంసీ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. నోట్ల రద్దు, విత్ డ్రా పరిమితి పెంచకపోవడంపై తీవ్ర అసహనంతో ఉన్న టీఎంపీ బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నది.  


ఐడియా, వోడాఫోన్ ల విలీనం?


దేశీయ టెలికాం కంపెనీలు ఐడియా, వోడాఫోన్ లు ఒకటికానున్నాయి . జియో నుండి ఎదురుకానున్న సవాల్ ను ఎదుర్కొనేందుకుగాను ఈ రెండు కంపెనీలు ఒక్కటి కానున్నాయి. ఇండియా వ‌ర‌కు వొడాఫోన్‌ను ఐడియాలో విలీనం చేసే దిశ‌గా చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ని వొడాఫోన్ స్ప‌ష్టంచేసింది. లాభాల‌ను స‌మంగా పంచుకునేలా డీల్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న ఈ రెండు కంపెనీలు.. దీనివ‌ల్ల పోటీని కూడా త‌ట్టుకోవ‌చ్చ‌ని భావిస్తున్నాయి. ఐడియా పేరెంట్ కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్‌తో సంప్ర‌దింపులు న‌డుస్తున్నాయ‌ని వొడాఫోన్ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. రిలయన్స్ కంపెనీ మార్కెట్ లోకి తెచ్చిన జియో ఇతర టెలికాం కంపెనీలకు పెద్ద సవాల్ ను విసిరాయి.జియో తట్టుకొనేందుకు ఇతర టెలికాం కంపెనీలు కూడ వినియోగదారులకు కొత్త ఆఫర్లను ప్రకటించాయి. 


పాకిస్తాన్ పై వీసా ఆంక్షలు విధించండి..!


 ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్ట‌కుండా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే ఈ లిస్ట్‌లో పాకిస్థాన్ కూడా చేర‌బోతోంద‌ని వైట్‌హౌజ్ స్టాఫ్ చీఫ్ రీన్స్ ప్రీబ‌స్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ట్రంప్ ఆదేశాల‌తో సిరియా, ఇరాన్‌, ఇరాక్‌, లిబియా, సోమాలియా, యెమెన్ దేశాల‌పై ప్ర‌భావం ప‌డింది. ఈ దేశాలతోనే ఉగ్ర‌వాదం విస్త‌రిస్తోంద‌ని ట్రంప్ బ‌లంగా భావిస్తున్న‌ట్లు ప్రీబ‌స్ తెలిపారు. తాజాగా తమ దేశంపై కూడా ఆంక్షలు విధించాలని కోరుతున్నారు మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్.  సాహివాల్ లో జరిగిన పార్టీ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కనీసం అప్పుడైనా పాకిస్తానీలు తమ దేశాభివృద్ధిపై దృష్టి సారిస్తారని ఆశిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: