ట్రంప్ స్పీడుకు బ్రేక్ వేసిన కోర్టు...!!

Shyam Rao

అమెరికా అధ్యక్షుడు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కు తొలిసారిగా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏడు ఇస్లామిక్‌ దేశాల పౌరులను తమ దేశంలోకి అడుగుపెట్టనీయకుండా డొనాల్డ్‌ ట్రంప్‌ వెలువరించిన ఉత్తర్వుపై న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు అత్యవసర స్టే విధించింది. ట్రంప్‌ ఆదేశాలపై ది అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ శనివారం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై అమెరికా డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయమూర్తి యాన్‌ డొనెల్లి విచారణ నిర్వహించి ఈ ఆదేశాలు జారీ చేశారు.



యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి యాన్ డొన్నెల్లీ ఇచ్చిన ఈ ఆదేశాలతో నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ దేశాల నుంచి చెల్లుబాటయ్యే వీసాలతో వచ్చిన వారిని అడ్డుకోలేరు. ఇక శరణార్థ దరఖాస్తు పెట్టుకుని ఆమోదం పొందిన వారికి కూడా ఇదే నిర్ణయం వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఉన్న శరణార్థులను వెనక్కు పంపొద్దని.. అంటే దీనర్థం వారిని అమెరికాలోకి అనుమతించమని కాదని... వీరిని గ్రే ఏరియా(శరణార్థి శిబిరం)లో ఉంచాలని సూచించింది.



శరణార్థుల హక్కుల ప్రాజెక్ట్‌ లీగల్‌ డైరెక్టర్‌ లీ గెలెర్ట్న్‌ ఈ కేసును వాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ చట్టం కింద బాధితులైన వారితో మాట్లాడి అవగాహన కల్పిస్తాం. కనీసం వారు తిరిగి ఆ నరకంలోకి వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: