వలస జీవుల విషాద గాధ...!!

gsr

వలసజీవితాలు విషాద భరితం. దేశమేదైనా, ప్రాంతమేదైనా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. విద్యావంతుల విషయంలో ఒకింత ఫరవాలేదని అనిపించినా అరకొర అక్షర జ్ఞానం గల సాధారణ కార్మికులకు ఎదురయ్యే చిక్కులు చెప్పలేనన్ని. స్వదేశంలో అనుమతుల సమస్యలు, విదేశాల్లో వీసా ఇబ్బందులు, ప్రయాణాల్లో ఏజెంట్ల అక్రమాలు, ప్రమాదాలు.. వెరసి ఒక్కోసారి అంతిమంగా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. మధ్యధరా సముద్రంలో ఇటీవలి పడవ ప్రమాదం ఇలాంటిదే. లిబియా నుంచి కిక్కిరిసిన వలసదారులతో బయలుదేరిన పడవ మునిగిపోయిన ఘటనలో ఏడువందలమంది జలసమాధి అయ్యారు.


ఐరోపా, ఆసియా, ఆఫ్రికా ఖండాలు, 21 దేశాలతో సరిహద్దులు కలిగిన మధ్యధరా సముద్రం ఆ మూడు ఖండాలని అనుసందానిస్తోంది. ఈ సముద్రంలో ఇటీవల కాలంలో ప్రమాదాలు ఎక్కువయ్యాయి. 2013 అక్టోబర్ లో పడవ మునిగి 360 మంది,2014 సెప్టెంబర్ లో సముద్రపు దొంగల దాడికి గురై పడవ కొట్టుకుపోయిన ప్రమాదంలో 300 మంది , గత ఏడాది ఫిబ్రవరిలో వాతావరణం అనుకూలించక పడవ ప్రమాదంలో 300 మంది, గత సంవత్సరంలో లిబియా తీరంలో పడవ బోల్తాపడిన ప్రమాదంలో 300 మంది, ఈ నెల 12 న లిబియా తీరంలో పడవ బోల్తా పడిన ప్రమాదంలో 400 మంది మరణించారు.


వలస వెళ్లే సమయంలో పడవ ప్రమాదాలు జరిగి మరణించిన వారి సంఖ్య గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది బాగా పెరిగిందని, ఈ సంఖ్య సుమారు 1600 వరకు ఉండవచ్చని అంతర్జాతీయ వలస సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా ప్రమాదాలను నివారించేందుకు, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు, మార్గమధ్యంలో సముద్రపు దొంగల ఆట కట్టేందుకు ఆయా తీర ప్రాంత దేశాలు చేసిందేమీ లేదన్నది చేదు నిజం.


ముఖ్యంగా అమెరికా,ఐరోపా, ఆగ్నేయాసియా దేశాల బాట పడుతున్నారు. విదేశాలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగుల భద్రత, సౌకర్యాలు, సంక్షేమం విషయంలో ఆయా దేశాలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఆ విషయంలో మన దేశ చరిత్ర ఆశించిన స్థాయిలో లేదు. ఏజెంట్ల అక్రమాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం, రాయబార కార్యాలయాల వైఫల్యం కారణంగా ప్రవాస భారతీయులు పడుతున్న పాట్లు వర్ణనాతీతం.


అక్రమాలకు పాల్పడే ఏజెంట్లపై రాష్ట్ర ప్రభుత్వాలే చెర్యలు తీసుకోవాలని, తాము కేవలం లైసెన్సులను మాత్రమే రద్దు చేయగలమని కేంద్రం చెబుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో వలసలు అనివార్యమైనందున పౌరుల భద్రత, తదితర విషయాల్లో సంబంధిత దేశాలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే అవాంచనీయ సంఘటనలకు అడ్డుకట్ట పడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: