అమరావతి యమ డేంజర్.. బీబీసీ సంచలన కథనం..

Chakravarthi Kalyan
అమరావతి ప్రపంచం మెచ్చే నగరం కావాలని చంద్రబాబు కలకంటున్నారు. ఆ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. సింగపూర్ నుంచి ప్రణాళిక, సాంకేతిక సాయం అందుకుంటున్నారు. జపాన్, చైనాల సాయమూ తీసుకుంటానంటున్నారు. 21 వ శతాబ్దంలో ఇలాంటి గొప్ప నగరం నిర్మించే గొప్ప అవకాశం ఎవరికీ రాలేదని తనకే వచ్చిందని గర్వంగా చెబుతున్నారు. 

అందుకే ప్రపంచం దృష్టిని ఆకర్షించేంత ఘనంగా అమరావతి శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. ఆయన అనుకున్నట్టే ఈ శంకుస్థాపన కార్యక్రమం జాతీయ, అంతర్జాతీయ మీడియాను ఆకర్షించింది. గతంలో ఎన్డీటీవీ ప్ర్తత్యేక కథనం ప్రసారం చేసింది. ఇప్పుడు ఏకంగా జగమెరిగిన బీబీసీ అమరావతిపై ప్రత్యేక కథనం ప్రచురించింది.    

అమరావతి వరమా విషమా అనే శీర్షికతో బీబీసీ ప్రచురించిన ఈ కథనం అత్యంత ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. అమరావతి నిర్మాణానికి దారి తీసిన నేపథ్యాన్ని వివరించిన బీబీసీ సింగపూర్‌కు పది రెట్లు అధిక విస్తీర్ణంలో అమరావతి నిర్మాణం జరగబోతోందని తెలిపింది. ఇంతవరకూ తెలుగు మీడియా తరహాలోనే సాగిన కథనం ఆ తర్వాత అనేక కఠోర వాస్తవాలను బయటపెట్టింది.  

రాజధానిపేరుతో ఏపీ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని తెలిపింది. రైతుల నుంచి భూములు ఇష్టం లేకుండా తీసుకున్నారని.. రాజధాని ప్రాంతంలో 144 ఆంక్షలు విధించారని తెలిపింది. బలప్రయోగం ద్వారానే తమ భూములను ప్రభుత్వం లాక్కున్నారని పలువురు రైతులు తమతో చెప్పినట్టు బీబీసీ వివరించింది. అన్నింటికీ మించి అమరావతి ప్రాంతంలో జరుగబోయే ప్రకృతి విధ్వంసాన్ని బీబీసీ కళ్లకు కట్టింది. 

అమరావతి నిర్మాణం ద్వారా దాదాపు కోటి చెట్లను నరికేయక తప్పదని తెలిపింది. అమరావతి నిర్మాణాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుపట్టిన విషయాన్ని కూడా ఈ కథనం తెలిపింది. కోటి చెట్లను నరికివేయడం ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రకృతి విపత్తును ఆహ్వానిస్తోందని కామెంట్ చేసింది. ప్రస్తుతం కొట్టేస్తున్న చెట్లకు మూడు రెట్లు చెట్లు పెంచకపోతే.. పర్యావరణ విపత్తు తప్పదని హెచ్చరించింది. బీబీసీ చెప్పినా..ఇలాంటి కథనాలను చంద్రబాబు పట్టించుకుంటారా..!?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: