అమెరికాలో ఇండియన్ డాక్టర్ల బాగోతం బట్టబయలు.. 29 కోట్ల సెటిల్మెంట్..?

Suma Kallamadi
ఇద్దరూ ఇండియన్ అమెరికన్లు, ఒక పెద్ద ఆసుపత్రి యజమాని కలసి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం గుర్తించిన అమెరికా న్యాయస్థానం డాక్టర్లతో పాటు ఆసుపత్రి యజమాని ని కూడా బజారుకీడ్చింది. దీనితో వారంతా లబోదిబోమంటూ తమపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని వేడుకుంటూ 37.5 మిలియన్ డాలర్లను పరిష్కార ఒప్పందానికి చెల్లించేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని అమెరికా న్యాయ విభాగం వెల్లడించింది. ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రేమ్ రెడ్డి.. కార్డియాలజిస్ట్ డాక్టర్ శివ అరుణాచలం తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదేంటంటే, కాలిఫోర్నియాలోని విక్టర్‌విల్లేలోని తన సొంత ఆస్పత్రి అయిన డిసెర్ట్ వ్యాలీ హాస్పిటల్ కి రోగులను రిఫెర్ చేయాలని చెప్పి డాక్టర్ శివకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చాడు.


ఈ విషయం తెలిసిన అమెరికా ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇటువంటి నీచమైన ఒప్పందాల వల్ల వైద్యులు, ప్రజల మధ్య ఉన్న మంచి అనుబంధం చెడిపోతుందని ఆగ్రహం వెళ్లగక్కింది. రోగులను మోసం చేసే చర్యలను తాము సహించబోమని విస్పష్టం చేసింది. దీంతో భారత మూలాలు ఉన్న డాక్టర్లు భయపడి పోయి సెటిల్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి సిద్ధపడ్డారు. తమపై వస్తున్న అన్ని ఆరోపణలను మాఫీ చేసినందుకుగాను డాక్టర్ ప్రేమ్ రెడ్డి 2 మిలియన్ డాలర్లు ఇస్తానని ఒప్పుకున్నారు. ప్రైమ్ ఆసుపత్రి తరఫున 33.7 మిలియన్ డాలర్లు ఇస్తామని వెల్లడించారు. ఇక లంచాలు తీసుకున్న కార్డియాలజిస్ట్‌ కూడా 1.7 మిలియన్ డాలర్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు.


రోగుల రిఫరల్స్ కు బదులుగా వైద్యులకు చట్టవిరుద్ధమైన ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి చర్యలు మా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క సమగ్రతను బలహీనపరుస్తాయని సివిల్ డివిజన్ యాక్టింగ్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ బ్రియాన్ ఎం బోయింటన్ చెప్పుకొచ్చారు. ప్రైమ్ హెల్త్ సర్వీసెస్ గతంలో 65 మిలియన్ డాలర్ల చెల్లించి తమ ఆసుపత్రిపై వస్తున్న ఆరోపణలను మాఫీ చేయించింది. అధిక బిల్లులు వసూలు, అసత్యాలు చెప్పి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేయడంవల్ల గతంలో ప్రైమ్ ఆసుపత్రి పై ఆరోపణలు వచ్చాయి. దీంతో 65 మిలియన్ డాలర్లు చెల్లించి తనపై వస్తున్న ఆరోపణలను తొలగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: