సాధారణంగా సెట్స్ లో కొంతమంది హీరోలు ప్యాకప్ చెప్పిన తర్వాత తమకు నచ్చిన డ్రెస్, షూటింగ్ లో వాడిన వస్తువు తమ తీపి గుర్తుగా తీసుకు వెళ్తుంటారు. ఇలాంటివి ఎక్కువగా క్రికెట్ రంగంలో జరుగుతుంటాయి..ఏదైనా క్రికెట్ మ్యాచ్ లో విజయం సాధించిన తరువాత బెయిల్స్ నో, బాల్ నో తీసుకుని దాన్ని జ్ఞాపకంగా దాచుకోవడం ఎన్నోమార్లు చూశాము. టాలీవుడ్ లో బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ‘సాహో’సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో స్టంట్స్ ను కోట్ల రూపాయలు వెచ్చించి షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఫైట్ సీన్లు తీస్తున్న సమయంలో ఓ కారు, బైక్ పై మనసు పడ్డాడు ప్రభాస్ , అందుకే వాటిని తానే ఉంచేసుకోవాలని చిత్ర యూనిట్ తో తెలిపారట. అవి ఇంటికి చేర్చినట్లు సమాచారం. సాహో’ సినిమా జ్ఞాపకంగా వాటిని తన వద్ద దాచుకోవాలనుకున్నారని చిత్రవర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో ప్రభాస్ భారీ ఫైటింగ్ సన్నివేశాలు చేయబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం కఠినమైన డైట్‌ను ఫాలో అవుతున్నారట.
ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ లో సైతం భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసమే ఎక్కువగా బాలీవుడ్ నటులను తీసుకున్నట్టు సమాచారం. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఎవ్లిన్ శర్మ, మందిరా బేడి, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.