కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు ప్రాణం పోశారు  ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి డాక్టర్ కె. విశ్వానాథ్‌.  ఇప్పటికీ ఈయన తీసిన సినిమాలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. సీతామాలక్ష్మి, సప్తపది, సిరిసిరిమువ్వ, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, సూత్రధారులు, శంకరాభరణం, స్వర్ణకమలం, శృతిలయలు, శుభసంకల్పం, స్వయంకృషి, స్వాతిముత్యం, సూత్రధారులు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సినిమా అద్భుత కళాఖండం అనే చెప్పాలి.  గత కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  

కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. 2016 సంవత్సరానికిగాను కె.విశ్వనాథ్‌కు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం సాయంత్రం ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం విశ్వనాథ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం జరగనుంది.  

ఎన్నో ఉత్తమ చిత్రాలను నిర్మించి ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న కె. విశ్వనాథ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంటున్న ఆరో తెలుగు వ్యక్తి. గతంలో బి.ఎన్. రెడ్డి (1974), ఎల్వీ ప్రసాద్ (1982), బి. నాగిరెడ్డి (1986), అక్కినేని నాగేశ్వరరావు (1990), డి. రామానాయుడు (2009) ఈ అవార్డును అందుకున్నారు.1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పెదపులివర్రు ఈయన స్వగ్రామం. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఓ స్టూడియోలో టెక్నీషియన్‌గా పనిచేసిన విశ్వనాథ్.. ఆ తరవాత ఆదుర్తి సుబ్బారావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. అలాగే కె. బాలచందర్, బాపు వద్ద కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అక్కినేని నాగేశ్వరరావుతో ‘ఆత్మగౌరవం’ సినిమా ద్వారా మెగాఫోన్ పట్టిన కె.విశ్వనాథ్.. తొలిసినిమాతోనే నంది అవార్డు అందుకున్నారు. 



Compliments to 'Kalatapasvi' K. Viswanath for being conferred Dadasaheb Phalke Award for 2016...

— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) April 24, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: