అలనాటి జ్ఞాపకాలు : హాస్యనటులు రేలంగి

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో హాస్యానికి ఉన్నంత ప్రాధాన్యత ఎందులోనూ లేదంటారు.  అంతే కాదు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంత మంది కమెడియన్లు ఏ ఇండస్ట్రీలో లేకపోవడం మరో విశేషం.  అయితే ఎంత మంది కమెడియన్లు ఉన్నా ఎవరి టాలెంట్ వారిదే..ఎవరికి ఉన్న క్రేజ్ వారిదే.  ఇక పాత తరం హాస్యనటుల విషయానికి వస్తే..రేలంగి,అంజి,పేకీటి శివరావు,అల్లు రామలింగయ్య,రమణారెడ్డి, పద్మనాభం,రాజబాబు,చలం ఇలా ఎంతో మంది తమ అద్భుతమైన హాస్యంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఏ సినిమాకైనా హాస్యం ప్రధాన అంశంగా తీసుకునేవారు..అందులో నటించే నటులు కూడా అంతే అద్భుతమైన నటన కనబరిచే వారు.  

అప్పటి హాస్యంలో ఎలాంటి వల్గారిటీ కానీ..ద్వంద అర్థాలు కాని లేకుండా మంచి ఆరోగ్యవంతంగా ఉండేది.   పాతం తరం హాస్య నటుల్లో ప్రముఖులు అయిన రేలంగి వెంకట్రామయ్య  రావులపాడులో 1910 ఆగష్టు 13వ తేదీన జన్మించాడు. రేలంగి తండ్రి హరికథలు, సంగీతం నేర్పించేవాడు...ఇవన్నీ చిన్న నాటి నుంచి ఆయనపై ఎంతో ప్రభావం చూపించాయి.  తండ్రి దగ్గర సంగీతం, హరికథలు నేర్చుకుంటూ పాటలు, పద్యాలు పాడడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు.

1919లో బృహన్నల అనే నాటకంలో స్త్రీ పాత్రతో మొదటిసారి నటించాడు.  1931లో విడుదలయిన భక్త ప్రహ్లాద చిత్రం చూసి తాను కూడా చలనచిత్రాలలో నటించాలని నిశ్చయించుకొని కలకత్తా చేరుకున్నాడు. అక్కడ సి.పుల్లయ్య నిర్మిస్తున్న శ్రీకృష్ణ తులాభారంలో రేలంగికి చిత్రాలలో మొదటి అవకాశం లభించింది.  సీనియర్ నటులు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.  ఎన్టీఆర్ తో మిస్సమ్మ చిత్రంలో ఎక్కువ ప్రాధాన్యత గల పాత్రలో నటించిన రేలంగా ఆ సినిమా సక్సెస్ లో తాను భాగమయ్యారు.   దాదాపు ప్రతి సినిమాలో రేలంగి ఒక ప్రముఖ పాత్రలో కనిపించేవాడు.  

మాయాబజార్, దొంగరాముడు, వెలుగునీడలు, విప్రనారాయణ, నర్తనశాల, అప్పు చేసి పప్పు కూడు మొదలయిన చిత్రాలలో వేసిన పాత్రలు కథానాయకుడితో సరిసమాన పేరు ప్రాముఖ్యతలను తెచ్చిపెట్టాయి.  కొన్ని పాత్రలు ఆయనకోసమే సృష్టించబడ్డాయా అనే రీతిలో హాస్యాన్ని పండించే వారు..మనిషి కాస్త లావుగా ఉన్న చాలా సున్నితమైన హాస్యాన్ని పండిస్తూ థియేటర్లో అందరినీ నవ్వించే వారు.  రేలంగి సరసన సూర్యకాంతం, గిరిజ ఎక్కువ నటించారు. సినిమాలో వీరి కాంబినేషన్ లో హాస్యం ఎంతో కనువిందుగా ఉండేది...ఎలాంటి వ్యంగం లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండేది.    

రేలంగి నటుడిగా మాత్రమే కాకుండా కొన్ని చిత్రాలలో పాటలు కూడా పాడేవాడు. 'వినవే బాల నా ప్రేమ గోల ' 'కాణీ ధర్మం సెయ్ బాబూ ' 'సరదా సరదా సిగరెట్టు ' వంటి రేలంగి పాడిన పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.  రేలంగి నటుడుగానే కాకుండా నిర్మాతగా  ‘సామ్రాజ్యం’ అనే చిత్రాన్ని నిర్మించాడు.. ఈ చిత్రం హాస్యనటుడు రాజబాబుకు మొదటి చిత్రం కావడం మరో విశేషం.  ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయన కూడా కొన్ని బాధలు పడ్డారు.  

వరవిక్రయం, గొల్లభామ మొదలయిన చిత్రాలలోని వేషాలతో పాటు చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు. దాదాపు పన్నెండేళ్ళ తర్వాత గుణసుందరి కథ చిత్రంలో పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చి రేలంగికి హాస్యనటుడిగా పేరు ప్రఖ్యాతులు, మరిన్ని అవకాశాలు తీసుకువచ్చింది.  

సినిమాలో హాస్యాన్ని పండించే రేలంగా వ్యక్తిగ జీవితంలో కూడా ఎంతో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు.  ఆయన ఎన్నో కళాశాలలకు విరాళాలు ఇచ్చారట.. ఎందరికో వివాహాలకు సహాయం చేసేవాడు. రేలంగి ఇంట నిత్యం అన్నదానములు జరిగేవి.  అంతే కాదు  పద్మ శ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడయిన రేలంగి 1975 నవంబరు 26 న కన్నుమూశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: