ఏపీ: వెళ్లిపోయిన కంపెనీలను వెనక్కి రప్పిస్తాం: లోకేష్

Suma Kallamadi
ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ యువనేత యువగళం పేరిట ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం షురూ చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుండి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి వెనక్కు తీసుకొస్తామని నారా లోకోశ్ ప్రజలకు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట యువగళం సభలో యువతతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఆయన మాట్లాడుతూ... "యువత పక్క రాష్ట్రాల వైపు చూడకుండా... సొంత రాష్ట్రంలోనే ఉపాధి పొందుతూ బతికేలా చర్యలు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇచ్చే తీరుతాము." అని ఈ సందర్భంగా లోకేశ్ నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ... 25 మంది ఎంపీలను ఇచ్చిన తరువాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్ రాష్ట్రాన్ని పట్టించుకోని పాపాన పోలేదని, పైగా గడ్డు పరిస్థితులకు కారణమయ్యాడని ధ్వజమెత్తారు. ఆ పార్టీకి 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారని, కానీ ఏనాడూ పార్లమెంటులో వాళ్లు ఏపీ గురించి మాట్లాడిన దాఖలాలు లేవని విమర్శించారు. 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీని గెలిపించారని, కానీ ఒక్క పరిశ్రమనైనా జిల్లాకు తీసుకొచ్చారా? అంటూ ప్రశ్నించారు. అదే తమ ప్రభుత్వ హయాంలో అయితే రూ.12-15 లక్షల కోట్ల ఒప్పందాలను కుదుర్చుకున్నామని లోకేశ్‌ తెలిపారు. 35 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు చేసుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వారి హయంలో కియా మోటార్స్ వచ్చి, 50 వేల మందికి ఉపాధిని కల్పించిందని అన్నారు. అదేవిధంగా హెచ్‌సీఎల్ కంపెనీ వచ్చిందని... అందులో కూడా నేడు 2 వేల మంది వరకూ పని చేస్తున్నారని లోకేశ్ తెలిపారు. ఈ విధంగా 44 వేల పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధిని తెలుగుదేశం పార్టీ కల్పించిందన్న లోకేశ్‌... కడపలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టామన్నారు. రూ.100 కోట్లతో ఒంటిమిట్ట దేవాలయాన్ని తెలుగుదేశం పార్టీనే అభివృద్ధి చేసింది అని చెప్పుకొచ్చారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణి విస్తృతంగా పర్యటించారు. తాడేపల్లిలోని ఓ వస్త్ర దుకాణంలో మహిళలతో సమావేశమై... కాసేపు ముచ్చటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: